పోయిన రెండు వారాలు మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంది టాలీవుడ్. దాంతో థియేటర్ల వద్ద తాకిడి కాస్త తగ్గింది. ప్రస్తుతం తెలుగు నుంచి మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’, నాగార్జున ‘ది ఘోస్ట్’.. అక్టోబర్ 5న దసరా బరిలో నిలవనున్నాయి. అయితే వారం ముందుగానే కోలీవుడ్ సినిమాలు టాలీవుడ్లో సందడి చేయబోతున్నాయి. అది కూడా తెలుగు బడా నిర్మాతల సమర్పణలో వస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. తమ్ముడు ధనుష్ హీరోగా, అన్న సెల్వరాఘవన్ దర్శకత్వంలో ‘నేనే వస్తున్నా’ అనే సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. కలైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లుఅరవింద్ విడుదల చేస్తున్నారు.
దాంతో ఈ సినిమా పై మంచి బజ్ ఉంది. ఇక మణి రత్నం నుంచి వస్తున్న భారీ పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. బాహుబలి రేంజ్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు తమిళ తంబీలు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ లీడ్ రోల్స్‌లో వస్తున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ రీమేక్‌గా తెరకెక్కిన ‘విక్రమ్ వేద’ సెప్టెంబర్ 30న హిందీలో రిలీజ్ కానుంది. అయితే తెలుగులో మరో రెండు, మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. కానీ వాటిపై పెద్దగా బజ్ లేదు. కాబట్టి ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వార్ కోలీవుడ్ సినిమాలదే అని చెప్పొచ్చు.