కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. ఈ బ్రదర్స్ కేవలం రీల్ హీరోలు మాత్రమే కాదు.. రియల్ హీరోలు కూడా. ప్రస్తుతం చెన్నై వరదల్లో చిక్కుకుంది. దీంతో తమవంతు సాయం అందించారు సూర్య, కార్తి.
Surya Brothers: ప్రస్తుతం తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ దారుణంగా ఉంది. చెన్నై నగరమంతా తడిసిముద్దవుతోంది. గత కొద్ది రోజులుగా చెన్నైతో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెన్నైలో చాలావరకు అన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. దీంతో జనం పడరాని పట్లు పడుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టింది.
సూర్య (Surya), కార్తి (karthi) కూడా ముందుకు వచ్చారు. ఇప్పటికే సూర్య ‘అగరం’ ఫౌండేషన్ పేరుతో పలు సేవ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చెన్నై వరద బాధితులను ఆదుకోవడానికి సూర్య, అతని తమ్ముడు కార్తీ ముందుకు వచ్చారు. తమ వంతు సాయంగా ఇద్దరు కలిసి 10 లక్షల రూపాయిల ఆర్థిక సాయం అందించినట్టు తెలుస్తోంది. వీళ్లతోపాటు చాలామంది చెన్నై ప్రజలకు అండగా నిలుస్తున్నారు. హీరో విశాల్ కూడా అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వీడియో షేర్ చేశాడు. ఇకపోతే.. సూర్య సినిమాల విషయానికొస్తే.. కంగువ షూటింగ్ స్టేజ్లో ఉంది. వచ్చే సమ్మర్లో ఈ సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక కార్తి వచ్చేసి రీసెంట్గా వచ్చిన జపాన్ సినిమాతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.