RRR : ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ నామినేషన్ ను దక్కించుకుంది. 95 వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ఈ సినిమా నిలిచింది. ఆస్కార్ నామినేషన్స్ లో భారత్ కు చెందిన పది సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటు పాట నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది.
ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. దానితో పాటు జపాన్ లో జరిగిన 46 వ అకాడమీ అవార్డ్స్ లోనూ అవుట్ స్టాండింగ్ ఫారెన్ మూవీ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డును దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవతార్ 2 సినిమాను, టాప్ గన్ సినిమాను వెనక్కి నెట్టింది. ఆస్కార్ అవార్డులను మార్చి 12న లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రదానం చేస్తారు. ఒకవేళ నామినేషన్స్ లో ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా పాట నాటు నాటుకు ఆస్కార్ అవార్డు వస్తే ఇక తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది ఈ సినిమా.
RRR : నాటు నాటు పాట సహా పోటీ పడుతున్న 5 పాటలు
మరోవైపు ఆస్కార్ నామినేషన్స్ రేసులో నిలిచిన కాంతారా సినిమాకు నామినేషన్స్ లో చోటు దక్కలేదు. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ సినిమా నామినేషన్స్ రేసులో నిలిచింది. ఆస్కార్ 95 ఒరిజినల్ సాంగ్ నామినీల్లో నాటు నాటు సాంగ్ సెలెక్ట్ అయింది. ఈ కేటగిరీలో నాటు నాటు పాటతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్ అనే సినిమా నుంచి అప్లాజ్ అనే పాట, టాప్ గన్ మావెరిక్ సినిమా నుంచి హోల్డ్ మై హాండ్, బ్లాక్ పాంథర్, వకండా ఫరెవర్ సినిమా నుంచి లిఫ్ట్ మీ అప్, ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమా నుంచి దిస్ ఈజ్ ఏ లైఫ్ అనే పాటలు నామినేషన్స్ బరిలో ఉన్నాయి. అంటే ఈ ఐదు పాటల్లో ఏ పాటకు ఎక్కువ ఓట్లు పడితే ఆ పాటకే ఆస్కార్ అవార్డు దక్కనుంది.