కామెడీని కరివేపాకులా తీసిపారేసే రోజుల నుంచి కామెడీని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్గా మార్చి, దానికి మళ్ళీ హీరోస్థాయిని కల్పించడం మహామహుల వల్లే కాలేదు. పెద్ద హీరోల పక్కన కామెడీ చేసి, చివరంటా కమెడియన్లుగానే మిగిలిపోయిన చరిత్ర మొత్తం మన కళ్ళ ముందే ఉంది. కానీ ఒక్క పేరు మాత్రం మినహాయింపుగా నిలబడింది. ఆ పేరే రాజేంద్రప్రసాద్
నటుడంటే ఏదో ఒక పాత్రని ధరించడం కాదు. ఏదో మేకప్ చేసుకుని తైతక్కలాడడం కాదు. నటుడంటే తన నటనా కౌశలంతో తన ధరించిన పాత్రకి తనదైన అస్థిత్వాన్ని ప్రసాదించగలగడం. నటుడంటే తనదైన నేర్పుతో సదరు పాత్రకి రక్తమాంసాలను చేకూర్చడం. అటువంటివారినే నటులంటాం. అనాలి కూడా. ఒక ఎన్టీఆర్, ఒక ఎఎన్నార్, ఒక ఎస్వీఆర్ ఇలా కొందరినే చెప్పగలుగుతాం. గడిచిన నాలుగు దశాబ్దాల సినీ చరిత్రని అవలోకిస్తే అటువంటి నటుడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరు.
కానీ, ధైర్యంగా ఒక్క పేరును మాత్రం చెప్పడానికి ఆ నటుడు అవకాశం మిగిల్చాడు. కామెడీని కరివేపాకులా తీసిపారేసే రోజుల నుంచి కామెడీని ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్గా మార్చి, దానికి మళ్ళీ హీరోస్థాయిని కల్పించడం మహామహుల వల్లే కాలేదు. పెద్ద హీరోల పక్కన కామెడీ చేసి, చివరంటా కమెడియన్లుగానే మిగిలిపోయిన చరిత్ర మొత్తం మన కళ్ళ ముందే ఉంది. కానీ ఒక్క పేరు మాత్రం మినహాయింపుగా నిలబడింది. ఆ పేరే రాజేంద్రప్రసాద్.
స్వయంగా ఇంజనీరే అయినా, సినీ పరిశ్రమకి నందమూరి తారకరామారావుగారి ప్రోత్సాహంతోనే వచ్చినా కూడా రాజేంద్రప్రసాద్‌కి ఆదిలో దక్కినవి కేవలం చిన్నాచితకా పాత్రలే. కానీ ఆ పాత్రలనే తన బతుకుదారికి పడికట్టుగా మార్చుకునే ఓర్పుని, నేర్పుని ప్రదర్శించడం ద్వారా మాత్రమే పరిశ్రమ దృష్టిని ఆయన అమితంగా ఆకర్షించగలిగారు. అది ఆయన ఛాంపియన్‌షిప్‌కి ఓ సైన్‌పోస్ట్. అద్భుతంగా డబ్బింగ్ చెప్పడంలో అందెవేసిన చేయిగా తొలిరోజుల్లో తిరుగులేని గుర్తింపును సాధించి, చిన్నపాత్రల నుండి కామెడీ చిత్రాలలో లీడ్ యాక్టర్ గా స్థానం సంపాదించుకోవడంలో రాజేంద్రప్రసాద్ అబివృద్ధి అందరినీ చిత్రపరిశ్రమలో ఆశ్చర్యచకితుల్ని చేసింది.
ఇంక అక్కడ నుంచి ఆయన ప్రయాణం నల్లేరు మీద బండే అయింది. ఎందుకంటే ఆయనలో అంత కెపాసిటీ ఉంది. తన పాత్రని పండించడమే కాదు, తద్వారా మొత్తం సినిమాని భుజాన్నెత్తుకుని సినిమా విజయానికి మూల స్తంభంగా ఎదురులేని సినిమా ట్రేడ్‌ని ప్రభావితం చేసిన మహానటుడు రాజేంద్రప్రసాద్. ఒక్క సినిమా అయితే సులభంగా రాసేయవచ్చు. ఎన్ని సినిమాలని, ఎన్ని హిట్లని, మరెన్ని జైత్రయాత్రలని…..అదొక ప్రభంజనం. అదొక విస్ఫోటనం. ఆయన కోసమని కథలు పుట్టుకొచ్చాయి. ఆయన డేట్ల కోసం క్యూలు మొదలయ్యాయి. ఇదంతా ఆషామాషీగా జరిగే వ్యవహారం కాదు. సినిమా పరిశ్రమలో కనిపించే పోటీ ఉండగా, మరోవైపున ఆసూయలు, అపోహలు కూడా ఒక హీరో ఎదుగుదలని అడ్డుకునే విషవలయాలు కూడా కంటికి కనిపించవుగానీ, వాటికున్న ప్రాబల్యం మాటల్లో చెప్పలేం. వాటిని కూడా ఆశ్చర్యచకితమైన విజయాలతో, దిగ్విజయాలతో అత్యంత సాహసవంతంగా ఎదుర్కొని, కేవలం ప్రతిభతో రాణించి, విషవలయాలను ఓడించిన చరిత్రంటూ ఎవరికైనా ఉందంటే అదొక్క రాజేంద్రప్రసాద్‌కి మాత్రమే సొంతం చెప్పాలని ఉంది.
ఒక తరం దొర్లిపోయిన తర్వాత, తర్వాతి తరానికి నటులు, హీరోలు పాతబడిపోతారు. లేదా అవుట్ డేట్ అయిపోతారు కానీ కాలం రాజేంద్రప్రాద్ని జయించలేకపోయింది. రాజేంద్రప్రసాదే అన్నిటా గెలిచాడు. ఇటీవలి దర్శకులు రాజేంద్రప్రసాద్ లేకుండా కదలని ఆలోచించలేకపోతున్నారు. ఆ నలుగురు, శ్రేయోభిలాషి, తోలుబొమ్మలాట….ఇలా కొన్ని సినిమాల గురించి చెబుతుంలే రాజేంద్రప్రసాద్ గురించి చెబుతున్నట్టు లేదు. ఆయన పట్ల దర్శకనిర్మాలకున్న భక్తివిశ్వాసాలను గురించి చెబుతున్నట్టుంది. యువతరం హీరోల కథల్లో రాజేంద్ర ప్రసాద్‌కే అగ్రతాంబూలం. తర్వాతే ఎవ్వరైనా, ఎవ్వరికైనా.
ఇటీవలి హిట్లు ఒక్కసారి తలుచుకోండి….ఆ హిట్లకి రాజేంద్రప్రసాద్ ఎంతగా ప్రాణం పోశారో మీరు ఇట్టే చెప్పగలుగుతారు. రాజేంద్రప్రసాద్‌ని వెబ్ సిరిసులు కూడా వదలిపెట్టడం లేదు. ఇటీవలి డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న హరికథ బంపర్ హిట్. నటకిరీటి అన్న బిరుదు ఎంత సమంజసమో కదా. ఆయన నట కిరీటి మాత్రమే కాదు. నట సవ్యసాచి కూడా అనాలనిపిస్తోంది. ఎందుకంటే ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు…..ఇలా పరిగెడుతున్న పేరు మరొకటి చెప్పమంటే నీళ్ళు నమలాల్సిందే. గౌరవడాక్టరేట్లు, నంది అవార్డులే కాదు, క్విక్ గన్ మురుగన్ అనే ఇంగ్లీసు ఫిల్మ్‌లో నటింటిన అరుదైన ఘనతకి తార్కాణంగా ఐఫా ఫిల్మ్ ఫెస్టివల్లో గ్రీన్‌కార్పెట్ వాక్‌తో సన్మానించారు రాజేంద్రప్రపాద్ని. కెనడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో డ్రీమ్ అనే మెడికల్ ధ్రిల్లర్కి గానూ రోయల్ రీల్ అవార్డును కూడా ఆయన గెలుచుకోవడం ఆయన ద్వారా లెలుగు సినిమకి అందిన మహా గౌరవం.
ఇది కదా కళా ప్రపూర్ణమైన జీవితం అంటే.
నిజంగా రాజేంద్రప్రసాద్ పరిపూర్ణ కళా ప్రపూర్ణుడు.