Prabhas: ప్రభాస్ vs షారుఖ్.. ప్రశాంత్ నీల్ కావాలనే చేస్తున్నాడా?
సోలోగా దిగితే ఏం ఉంటది కిక్.. పోటీ ఉంటేనే మజా ఉంటుంది. అందుకే.. కావాలనే ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్‌తో పోటీకి దిగుతున్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్ పోటీ లేకుండా రిలీజ్ కాలేదు. అది కూడా షారుఖ్‌తో పోటీ పడ్డాడు. అందుకే ఇప్పుడు సలార్‌తో సై అంటున్నాడా?
సలార్ లేటెస్ట్ రిలీజ్ డేట్ చూసిన తర్వాత.. ప్రశాంత్ నీల్ కావాలనే పోటీకి దిగుతున్నాడా? అంటే, ఔననే టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన సలార్.. డిసెంబర్ 22న డేల్ లాక్ చేసుకున్నట్టుగా దాదాపుగా కన్ఫామ్ అయిపోయింది. అదే రోజు షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘డంకీ’ రిలీజ్ అవుతోంది. అది తెలిసి కూడా సలార్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. ఇప్పటికే షారుఖ్ ఖాన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.
అలాంటిది.. సలార్‌కు రిస్క్ అవసరమా? అని అంటున్నారు. కానీ పోటీ ఉంటేనే ప్రశాంత్ నీల్ తన సినిమాను రిలీజ్ చేసేలా కనిపిస్తున్నాడు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా.. పోటీ పడితే కింగ్‌ఖాన్ లాంటోడితేనే పడాలి అన్నట్టుగా ఉంది ప్రశాంత్ నీల్ లెక్క. ఇప్పుడే కాదు.. గతంలో కూడా పోటీ లేకుండా బరిలోకి దిగలేదు ప్రశాంత్ నీల్. గతంలో 2018లో కెజియఫ్ చాప్టర్ వన్ను షారుఖ్ ‘జీరో’ సినిమాకు పోటీగా రిలీజ్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈ వార్‌లో కెజియఫ్నే గెలిచింది.
ఆ తర్వాత కెజియఫ్ చాప్టర్ 2 కూడా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘బీస్ట్’ సినిమాతో ఏప్రిల్ 14 క్లాష్ అయింది. అప్పుడు కూడా ప్రశాంత్ నీల్దే పై చేయి అయింది. కానీ ఇప్పుడున్నది అప్పుడున్న షారుఖ్ కాదు అంటున్నారు. అయినా కూడా డిసెంబర్ 22న మరోసారి షారుఖ్‌తో పోటీ పడాలని ఫిక్స్ అయిపోయాడట నీల్. అందుకే.. ప్రశాంత్ నీల్ భార్య లిఖితారెడ్డి.. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ‘2023 డిసెంబర్ ఎప్పటిలా ఉండదు.. వెయిట్ చేయలేకపోతున్నాను’ అని రాసుకొచ్చిందని అంటున్నారు. మరి ఈసారి కూడా షారుఖ్ పై ప్రశాంత్ నీల్ గెలుస్తాడేమో చూడాలి.