ప్రజెంట్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా మరో ఆఫర్ కూడా అమ్మడి ఖాతాలో నుంచి ఎగిరిపోయినట్టుగా తెలుస్తోంది.
Pooja Hegde: బుట్టబొమ్మకు బడా బడా హీరోలతో వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ పూజా బ్యాడ్ లక్ ఏంటో గానీ.. హిట్స్‌తో పాటు ఆఫర్లు కూడా చేజారిపోతున్నాయి. లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి మధ్యలోనే డ్రాప్ అయిపోయింది. ఏం జరిగిందో ఏమోగానీ.. షూటింగ్ మధ్యలో నుంచే పూజను తప్పించారు మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చాడు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా ప్లేస్‌ను శ్రీలీలతో భర్తీ చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో ముందు నుంచి పూజాహెగ్డేనే హీరోయిన్గా అనుకున్నారు.
కానీ త్రివిక్రమ్ లాగే శ్రీలీలను మెయిన్ హీరోయిన్గా తీసుకొని షాక్ ఇచ్చాడు హరీష్ శంకర్. ఇలా పూజాకు ఒక్కో ఆఫర్ చేజారిపోతోంది. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కూడా మరో హీరోయిన్ ఎగరేసుకుపోయినట్టుగా తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ముందుగా పూజా హెగ్డేని హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం మరో కన్నడ బ్యూటీకి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సప్త సాగరాలు దాటి చిత్రంలో నటించిన కన్నడ భామ రుక్మిణి వసంత్‌ను రవితేజ సరసన ఓకె చేశారట. దీంతో తెలుగులో పూజా హెగ్డేకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోయినట్టే. దీంతో.. ఇక పై పూజా పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాల మాట. మరి పూజా పరిస్థితేంటో ఆమెకే తెలియాలి.