మెగా స్టార్ చిరంజీవిని ఎవరు ఒక్కమాట అన్నా తమ్ముడు నాగబాబు అస్సలు ఊరుకోరు. అందుకు తాజాగా జరిగిన సంఘటనే ఓ ఉదాహరణ. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… చిరంజీవి… బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్, బలయ్ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిరంజీవి అక్కడకు వెళ్లే సరికి ఫ్యాన్స్ ఆగలేకపోయారు. చిరుకి ఉన్న ఫ్యాన్స్ బేస్ అలాంటిది. చిన్నపాటి హీరోలు కనపడితేనే సెల్ఫీలు అంటూ జనాలు మీదపడిపోతారు. అలాంటిది చిరంజీవిని చూస్తే ఆగుతారా..? జనాలుకూడా అదే చేశారు. ఆయనను వదలకుండా సెల్ఫీలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే… అక్కడకు చిరుతో పాటు ప్రముఖ ప్రవచకర్త గరికపాటి కూడా హాజరయ్యారు.
ఆయన ప్రసంగం ఇవ్వాల్సి ఉండగా.. చిరు అక్కడ సెల్ఫీలు ఇస్తుండటం గరికపాటికి అసహనాన్ని కలిగించింది. ఇంకేముంది ఆయన ఆ అసహనాన్ని బయటకు ప్రదర్శించాడు. చిరు కూడా క్షమాపణలు చెప్పి ఆ సెల్ఫీల తంతుకు ముగింపు పలికాడు. అంతటితో అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ.. నాగబాబు ఊరుకోవాలిగా. తన అన్నపై గరికపాటి చూపించిన అసహనానికి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే.. అంటూ నాగబాబు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. తన సోదరుడికి దక్కిన ఇమేజీని చూసి గరికపాటి అసూయపడ్డారనే అర్థం వచ్చేలా నాగబాబు సెటైరిక్ పోస్ట్‌ను ప్రయోగించారు. అయితే ఈ పోస్ట్ లో గరికపాటి పేరును నాగబాబు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ సాగుతోంది.