గుంటూరు కారం సినిమాలోని ‘కుర్చీని మడత పెట్టి’ పాటకు ఆన్లైన్లో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికి యూట్యూబ్‌లో దీన్ని 200 మిలియన్ల మంది చూశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Kurchi Madathapetti song : సంక్రాంతికి విడుదలైన మహేష్ బాబు చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాలో మహేష్ బాబు, హీరోయిన్ శ్రీలీల కలిసి స్టెప్పులేసిన ‘కుర్చీని మడత పెట్టి’ సాంగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ చెప్పనవసరం లేదు. యూట్యూబ్‌లో ఈ పాటకు ఇప్పటి వరకు 200 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సాంగ్ పెద్ద మైల్ స్టోన్‌ని రీచ్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
ఈ పాట తెలుగు ప్రేక్షకుల్నే కాకుండా భారత దేశ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్‌ని కూడా ఉర్రూతలూగిస్తోంది. చాలా మంది విదేశీయులు కూడా ఈ పాటను ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్లో వైరల్ అయ్యాయి. అంతర్జాతీయంగా జరిగే పలు ఈవెంట్లలో కూడా ఈ పాట వినిపిస్తుండటం ఇది ఎంత పెద్ద హిట్టో చెప్పకనే చెబుతోంది. తాజాగా 200 మిలియన్ మైల్ స్టోన్‌ని చేరుకోవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాట హిట్‌పై ఆదిత్యా మ్యూజిక్ సైతం స్పందించింది. ఈ విషయాన్ని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇటీవల కాలంలో ఈ పాటకు అత్యధికంగా రీల్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. భారత్ స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ ఆయన భార్య అనుష్క శర్మతో కలిసి ఈ పాటకు స్టెప్పులేశారు. ఆ రీల్ ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో తెగ వైరల్ అయింది. సినిమా వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గకుండా మరింత వైరల్ కావడం విశేషం.