టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. సెబాస్టియన్, సమ్మతమే చిత్రాలతో అలరించలేకపోయాడు. ఈ క్రమంలో తాజాగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. ఆ తర్వాత శ్రీధర్ గాదె దర్శకత్వంలో వచ్చిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో కమర్షియల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాడు. దాంతో ఇప్పుడు మరోసారి శ్రీధర్ గాదెతో కలిసి ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. దాంతో కిరణ్ తిరిగి ఫామ్‌లోకి రావడం పక్కా అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమాను ముందుగా సెప్టెంబరు 9న విడుదల చేయడానికి రెడీ అయిపోయారు. కానీ తాజాగా మరో వారం పోస్ట్ పోన్ చేశారు. డేట్ మారింది అంతే.. ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా.. అంటూ సెప్టెంబర్ 16వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 9న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ తో పాటు.. శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలపై మంచి బజ్ ఉంది. అందుకే కిరణ్ రేసు నుంచి వెనక్కి తగ్గాడని చెప్పొచ్చు. అయితే సెప్టెంబర్ 16 కూడా సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘శాకిని డాకినీ’ వంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మరి కిరణ్ ఈ సారి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.