తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ప్రభాస్ కట్ అవుట్స్ కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. కాగా, తాజాగా భక్త కన్నప్ప మూవీ టీమ్ కూడా ప్రభాస్ కి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం. ‘ ప్రభంజనమై ప్రేక్షక హృదయాలను మనసుతో, వ్యక్తిత్వంతో, నటనతో గెలుచుకొని, ప్రపంచమంతా శభాష్ అనిపించుకుంటున్న మా ప్రభాస్ కి జన్మదిన శుభాకాంక్షలు.. శతమానం భవతి, శతశత మానం భవతి.. కన్నప్ప ఫిల్మ్ యూనిట్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
మంచు హీరో విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ బడ్జెట్ తో కూడా తెరకెక్కిస్తున్నారు. భక్త కన్నప్ప సినిమాలో శివుడు పాత్ర ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే, ఆ శివుడి పాత్ర కోసం ప్రభాస్ ని ఎంచుకున్నారు. అందుకే, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇలా విషెస్ తెలియజేయయడం విశేషం. శివుడిగా గతంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు అదరగొట్టారు. ఇప్పుడు ఈ పాత్రను ప్రభాస్ బాగా చేయగలడు అని మూవీ టీమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక పార్వతీ దేవి పాత్రకు లేడీ సూపర్ స్టార్ నయనతారను కూడా ఎంచుకోవాలని అనుకుంటున్నారు. గతంలో సీత పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. అందుకే, ఆమెను పార్వతీ దేవిగా తీసుకోవాలని అనుకున్నారట. ఈ మేరకు ఆమెను సంప్రదించారని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో ప్రభాస్ , నయన తారలు యోగి సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. తల్లి సెంటిమెంట్ తో సాగే కథ ఇది. అయితే, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించింది లేదు. ఇక కన్నప్ప విషయానికి వస్తే, మహాభారత హిందీ సీరియల్ కి దర్శకత్వం వహించిన డైరెక్టర్ మఖేష్ కుమార్ సింగ్, ఈ సినిమాకి కూడా దర్శకత్వం అందించనున్నారు. ఇక, ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్, తోట ప్రసాద్ కథను అందించగా, మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు.