ప్రస్తుతం మహేష్ బాబునే కాదు ఆయన అభిమానులను కూడా ఓదార్చడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా ఒకే ఏడాదిలో మూడు విషాదాలంటే.. మహేష్ గుండె ఎంత బరువెక్కి ఉంటుందో మాటల్లో చెప్పలేం. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో యావత్ సినీ ప్రపంచం శోక సంద్రంలో పడిపోయింది. ఈ ఏడాది మహేష్ బాబుకు ఎప్పటికీ మరువలేని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
మహేష్ పరిస్థితి చూసి ఇలాంటి కష్టాలు ఎవరికి రాకూడదంటున్నారు. ఎప్పుడు మొహం పై చిరునవ్వు చిందించే మహేష్ బాబు.. తనలో తానే కుమిలిపోతున్నాడు. అది చూసి అభిమానులు మరింతగా కుమిలిపోతున్నారు. ఇక పై ఇంతకు ముందులా మహేష్‌ను చూడడం సాధ్యమేనా అని ఆందోళన పడుతున్నారు. ఇదంతా.. నిజం కాకుండా ఉంటే బాగుండని అంటున్నారు. మహేష్‌ను ఓదార్చడం ఎవరి వల్ల కాదని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్‌కు సంబంధించిన ఎన్నో బరువెక్కించే ఫోటోలు.. సోషల్ మీడియానే విషాదంలో పడేసింది. సూపర్ స్టార్ కృష్ణ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. ముఖ్యంగా మహేష్ కుటుంబానికి తీరని లోటు. ఈ ఏడాదిలోనే కరోనా సమయంలో మహేష్ తన అన్నయ్య రమేష్ బాబును కోల్పోయారు. ఆ తర్వాత మహేష్ తల్లి ఇందిరాదేవి తుది శ్వాస విడిచారు. ఇక ఇప్పుడు తల్లిపోయిన బాధ నుండి ఇంకా తేరుకోకముందే.. తండ్రి కృష్ణ మరణించడం మహేష్‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ఒక్క తండ్రిగానే కాదు.. అన్ని విధాలుగా కృష్ణ అంటే మహేష్‌కు చెప్పలేనంత ప్రేమ, ధైర్యం. అందుకే.. మహేష్‌కు ధైర్యంగా నిలబడేందుకు యావత్ అభిమాన లోకం కదిలి వచ్చింది. అసలు తమ అభిమాన హీరో ఇలాంటి పరిస్థితుల్లో చూస్తామని ఎపుడూ ఊహంచలేదని.. నీకు మేమంతా ఉన్నామంటూ ధైర్యం చెబుతున్నారు ఘట్టమనేని అభిమానులు. మొత్తంగా 2022 మహేష్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. మరి మహేష్ ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.