Navadeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు
ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు డ్రగ్స్. ఈ డ్రగ్స్ సమస్య టాలీవుడ్లో కలకలం రేపుతోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కి సంబంధించిన చాలామంది ఉన్నారు. అందులో హీరో నవదీప్ కూడా ఉన్నాడని.. ఇప్పటికే అధికారులు నవదీప్‌ను విచారించారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ కూడా నవదీప్‌కు నోటీసులు జారీ చేసింది.
Navadeep: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసు దుమారం రేపుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) నోటీసులు జారీ చేసింది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విషయంలో నవదీప్‌ను నార్కోటిక్ బ్యూరో విచారించింది. దీని ఆధారంగా ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇంతకుముందు రెండుసార్లు నోటీసులు పంపినా నవదీప్ విచారణకు హాజరు కాలేదు. ఈ నెల 10వ తేదీన నవదీప్ విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో తెలిపారు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాతో నవదీప్‌కు సంబంధం ఉందని.. అధికారులు విచారణ జరపనున్నారు.
ఆగస్టు 31న మాదాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది. అక్కడ సోదాలు నిర్వహించిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు కొంతమంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇందులో నైజీరియన్లతోపాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు నిందితులు ఉన్నారు. ఈ కేసులో పట్టుబడిన రామ్‌చంద్ అనే నిందితుడి విచారణతో హీరో నవదీప్ పేరు బయటకు వచ్చింది. దీంతో అధికారులు నవదీప్‌ను కూడా ఈ కేసులో చేర్చారు. దీనికి వ్యతిరేకంగా నవదీప్ సెప్టంబర్లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును హైకోర్టు కొన్ని రోజులు వాయిదా వేసి.. తర్వాత తన పిటిషన్‌ను కొట్టివేసి విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో సెప్టెంబర్ 23న నవదీప్‌ను అధికారులు విచారించారు. తనకు డ్రగ్స్‌కు ఎలాంటి సంబంధం లేదని నవదీప్ తెలిపాడు. కానీ మరోసారి విచారణకు రావాలని నోటీసులు వచ్చాయి.