»Heavy Fine For Hero Vijay Inquiry Adjourned To October 30
Hero Vijay Thalapathy: హీరో విజయ్‌కు భారీ జరిమానా..అక్టోబరు 30కి విచారణ వాయిదా
పన్ను ఎగవేత కేసులో హీరో విజయ్ కేసుపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తమకు గడువు కావాలని విజయ్ లాయర్ కోరడంతో మూడు వారాలు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
తమిళ స్టార్ హీరో విజయ దళపతికి ఆదాయ పన్ను శాఖ రూ.1.5 కోట్ల జరిమానాను విధించింది. ఈ నేపథ్యంలో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. విజయ్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే తదుపరి విచారణను అక్టోబరు 30కి వాయిదా వేస్తూ కోర్టు ప్రకటించింది. 2015-16లో అదనపు ఆదాయానికి సంబంధించిన వివరాలను విజయ్ తెలియజేయలేదంటూ ఐటీ శాఖ భారీ జరిమానాను విధించింది. దానిపై హీరో విజయ్ గతేడాది జూన్ 30న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ సాగుతోంది.
నేటి విచారణలో హీరో విజయ్ తరపు లాయర్ తనకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ కృష్ణన్ రామస్వామి తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తూ ప్రకటించారు. ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి ఐటీ విభాగం గతంలో హీరో విజయ్ నివాసంలో సోదాలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఐటీ రిటర్నులు సమర్పించే సమయంలో విజయ్ తన పూర్తి ఆదాయానికి సంబంధించిన వివరాలు చూపలేదనేందుకు తగిన ఆధారాలను ఆ సోదాల్లో ఐటీ విభాగం గుర్తించినట్లు తెలిపింది. అంతేకాకుండా విజయ్ నివాసం నుంచి కీలక పత్రాలను కూడా ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.
2015లో విజయ్ హీరోగా ‘పులి’ అనే సినిమా విడుదలైంది. ఆ చిత్ర నిర్మాతలు హీరో విజయ్ కి రూ.4.93 కోట్లు నగదు రూపంలో, మరో రూ.16 కోట్లు చెక్ రూపంలో అందించారు. అయితే నిర్మాతలు నగదు రూపంలో ఇచ్చిన డబ్బుకు మాత్రమే టీడీఎస్ చెల్లించారని, చెక్ రూపంలో ఇచ్చిన మొత్తానికి టీడీఎస్ చెల్లించలేదని ఐటీ విభాగం సోదాల్లో తేలింది. దీంతో విజయ్ పై ఆదాయపు పన్ను శాఖ రూ.1.5 కోట్ల భారీ జరిమానాను విధిస్తూ చర్యలు చేపట్టింది.