»Hanuman Movie Review Teja Sajja As A Superhero Pleases
Hanuman Movie Review: తేజ సజ్జా సూపర్ హీరోగా మెప్పించాడా!
డైరక్టర్ ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కాంబోలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ చిత్రంలో హరోయిన్‌గా అమృత అయ్యర్ నటించింది. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్, గెటప్ శ్రీను వంటివారు కూడా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తేజ సజ్జా సూపర్ హీరోగా మెప్పించాడా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం.
కథ
అంజనాంద్రి గ్రామంలో హనుమంతు (తేజా సజ్జా) అల్లరి చిల్లరిగా తిరుగుతూ కాలం గడుపుతుంటాడు. ఆ గ్రామంపై పాలేగార్ల దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తుంటారు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదురించడానికి ప్రయత్నించే క్రమంలో చావుదెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. అప్పుడు హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించిన విధంగా అద్బుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారిన విషయం తెలుసుకొన్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ గ్రామానికి వస్తాడు. అంజనా గ్రామంలో అంజనమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? గ్రామంలోని మీనాక్షి (అమృతా అయ్యర్) ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏమిటి? పాలెగాళ్ల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకొన్న మైఖేల్ దుష్టపన్నాగాలకు హనుమంతు ఎలా చెక్ పెట్టాడు. ఈ దుష్ట శక్తులను ఎదురించే క్రమంలో ఆంజనేయస్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది? ఆ తర్వాత ఏం అయ్యిందని తెలుసుకోవాలంటే ధియేటర్లలో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
హనుమంతుడి మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఆయనకు శక్తులు ఎలా ఉంటాయో సినిమాల్లో చూశాం. ఈ హనుమాన్ చిత్రం కొత్త కథ, అద్భుతమైన కథ అని చెప్పలేం. కానీ.. తనదైన కథనంతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడు. అల్లరి చిల్లరిగా తిరిగే ఓ వ్యక్తికి హనుమంతుడి శక్తులు లభిస్తే ఎలా ఉంటుంది? ఆ శక్తులను తన ఊరి కోసం వాడాల్సి వచ్చిన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? జరిగిన పరిణామాలు ఏంటి? ఆ శక్తిని అందుకోవడం కోసం వచ్చిన వ్యక్తి ఎలా మట్టి కరిపించాడు? వంటి విషయాలను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ సఫలమయ్యాడు. సినిమా మొదట్లోనే విలన్‌ను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు డైరక్టర్. ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి హీరో కావడం.. వాటిని దక్కించుకోవడానికి విలన్ అనేక రకాల ప్రయత్నాలు చేయడం బాగున్నాయి. ఆ పవర్స్ కోసం తల్లిదండ్రులను చంపేసి ఎప్పటికైనా సూపర్ హీరో కావాలని ప్రయత్నించే ఒక పిచ్చి పట్టిన మనస్తత్వం కలిగిన వ్యక్తి వాటిని దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నమే హనుమాన్. అయితే ఇందులో విభీషణుడు రావడం, హనుమంతునికి విషయం అంతా చెప్పడం లాంటివి కన్విన్సింగ్‌గా చెప్పడం వంటివి ఎక్కడా బోర్ కొట్టదు. సినిమాలో గూజ్ బంప్స్ సన్నివేశాలు చాలా ఉంటాయి. హనుమంతుడు రిఫరెన్స్ వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అవకాశం చాల ఎక్కువగా ఉంటుంది. హీరో ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడటం.. అక్కడ అతనికి రుధిరమణి దొరకడం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ దొరికినప్పటి నుంచి కథ పరుగులు పెడుతుంది. రుధిరమణిని సంపాదించడం కోసం మైఖేల్ చేసే ప్రయత్నాలు.. అతని ద్వారా అంజనాద్రికి ముప్పు ఏర్పడుతుంది. దీని నుంచి ఊరి ప్రజల్ని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్థం సాగుతుంది. సినిమాలో చివరి 20 నిమిషాలు చాల కీలకం. ఎవరూ కళ్లు కూడా పక్కకు తిప్పుకోలేనంత విజువల్ వండర్ లాగా ప్రశాంత్ వర్మ డిజైన్ చేసుకున్నాడు. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు బాగుంది.
ఎవరెలా చేశారంటే?
ఇక నటీనటుల విషయానికి వస్తే, తేజసజ్జ, హనుమంతు పాత్రలో ఇమిడిపోయాడు. చలాకిగా, అల్లరిగా వుండే పాత్రలో మెప్పించాడు. తరువాత సూపర్ మ్యాన్ అయిన తరువాత కూడా నటనలో పరిణితి చూపించాడు. ఈ సినిమా అతని కెరీర్‌ని ఒక మెట్టు పైకి తీసుకువెళ్తుంది. అమృత అయ్యర్ డాక్టర్ పాత్రలో కథానాయకురాలిగా బాగా చేసింది. ఆమెకి ఇది మంచి పాత్ర అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అక్కగా బాగుంది, కానీ ఆమె యాస సరిగ్గా సెట్ కాలేదు అనిపిస్తుంది. ఇక సత్య, గెటప్ శీను కొన్ని నవ్వులు పండించారు. వినయ్ రాయ్ విలన్‌గా బాగున్నాడు. వెన్నెల కిశోర్ సైంటిస్ట్‌గా కనపడతాడు. మిగతా పాత్రల్లో అందరూ వారి పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక విభాగం
టెక్నికల్ విభాగంలో విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. బడ్జెట్ తక్కువే అయినా క్వాలిటీలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. కెమెరామెన్ పనితనం మెచ్చుకోవచ్చు. అంజనాద్రి అందాలను, అటవీ ప్రాంతాల సోయగాలను, మైమరపించే జలపాతాలను ఆకట్టుకునే విధంగా తీశారు. ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+కథా
+తేజ సజ్జా నటన
+గ్రాఫిక్స్ క్వాలిటీ
+నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
-నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు