Pindam Trailer: చాలా కాలం తరువాత తెలుగులో అసలైన హర్రర్ చిత్రం రాబోతుంది అదే ‘పిండం’(Pindam). ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్’ (The Scariest Film Ever)అనేది ఉప శీర్షిక. హీరో శ్రీరామ్(Sri Ram), హీరోయిన్ ఖుషీ రవి(Khushi Ravi) జంటగా సాయికిరణ్ దైదా(Saikiran Daida) దర్శకత్వంలో కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ట్రైలర్ విడుదలైంది. 3 నిమిషాల 45 సెకన్లలో చాలా సీన్లు చాలా ఇంటెన్సీవ్‌గా అనిపించాయి. మల్టీ టాలెంటెడ్ అవసరాల శ్రీనివాస్ ఈశ్వరీ రావుతో “మరణం అనేది నిజంగానే అంతమా, మరణించిన తరువాత ఏం జరుగుతుందనేది ఎవరైనా చెప్పగలరా.. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా.. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా” అనే డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. తరువాత శ్రీరామ్ తన కుటుంబంతో పాటు ఒక ఇంట్లోకి వెళ్తారు. అక్కడ జరిగే సంఘటనలతో ఆ కుటుంబం ఎలాంటి బాధలు పడింది. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారు. వీరిని ఇబ్బంది పెట్టే ఆత్మలు ఎవరివి, అవి ఎందుకు దెయ్యాలుగా మారాయనేది సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
అయితే ఇందులో ఈశ్రరీ రావు కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తుంది. మీ కుటుంబాన్ని వేధించేది ఒక్క ఆత్మకాదు అని చెప్పె డైలాగ్, ఆమె ఆహార్యం చూస్తుంటే దెయ్యాలను వదిలించే మంత్రగత్తేలాంటి పాత్ర అని అర్థం అవుతుంది. ఆత్మల నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? వాళ్ల చిన్న పాపకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ట్రైలర్ చివర్లో “ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం.” అని ఈశ్వరీ రావు చెప్పిన మాటల తీరు ఆకట్టుకుంది. ఇక హర్రర్ చిత్రాలకు ముఖ్యంగా విజువల్స్, మ్యూజిక్ చాలా ఎఫెక్టీవ్‌గా ఉండాలి. ట్రైలర్ చూస్తుంటే అవి చాలా బాగా కుదిరినట్లు అనిపిస్తుంది. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తుంది.