ఈ వారం సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం కొన్నే ఉన్నాయి. శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పిండం మూవీ( Pindam Movie) ఈరోజు థియేటర్లలో విడుదలైంది. హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో చూద్దాం.
హారర్ సినిమాలంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంత కామెడీతో పాటు హారర్ సినిమాల కంటే పూర్తిగా భయపెట్టే విధంగా ఉండే సినిమాలను ఈ మధ్య ఎక్కువగా వీక్షిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన శ్రీరామ్ హీరోగా పిండిం సినిమా తెరకెక్కింది. టీజర్, ట్రైలర్‌తోనే ప్రేక్షకులను భయపెట్టిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
చిత్రం:పిండం నటీనటులు: శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ, తదితరులు కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ సంగీతం:కృష్ణ సౌరభ్ సూరంపల్లి దర్శకత్వం: సాయికిరణ్ దైదా నిర్మాత:యశ్వంత్ దగ్గుమాటి నిర్మాణ సంస్థ: కళాహి మీడియా విడుదల తేదీ: 15/12/2023
కథ
తన తండ్రి ద్వారా వచ్చిన తాంత్రిక జ్ఞానంతో అన్నమ్మ (ఈశ్వరీరావు) ఎంతోమందికి సాయం చేస్తుంటుంది. ఎవరికైనా ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తుంటుంది. అయితే తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్‌నాథ్ (శ్రీనివాస్ అవసరాల) అన్నమ్మ వద్దకు వస్తారు. ఈక్రమంలో ఆమె 1990 నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది. అదే ఆంథోనీ కుటుంబం కథ. క్రిష్టియన్ మతానికి చెందిన ఆంథోనీ (శ్రీరామ్) ఓ రైసు మిల్లులో అకౌంటెంట్‌గా పనిచేస్తుంటాడు. గర్భవతి అయిన తన భార్య మేరీ (ఖుషి రవి), పిల్లలతో కలిసి ఊరి చివర ఉండే ఇంటిని కొని అందులో నివసిస్తుంటాడు. ఆ ఇంట్లోకి వెళ్లినప్పటి నుంచి అందరూ ఆత్మల బారిన పడి ఇబ్బందులకు గురవుతుంటారు. ఇంటిని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న.. ఆ ఆత్మలు మాత్రం వాళ్లను వదలవు. అసలు ఆ ఆత్మలు ఎవరివి? ఆ ఇంట్లో ఎందుకు ఉన్నాయి? వాటి నుంచి ఆంథోనీ కుటుంబం ఎలా బయటపడింది? ఎందుకు అవి ఇబ్బందులు పెడుతున్నాయి? వంటి విషయాలు తెలియాలంటే పిండం(Pindam Movie) థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ మధ్య కాలంలో వచ్చిన హారర్ సినిమాలు కామెడీగా ఉండటంతోపాటు భయాన్ని కూడా కలగజేస్తున్నాయి. కానీ పిండం సినిమా మాత్రం కేవలం భయమే ప్రధానంగా సాగుతుంది. ఈ కథలో కొత్తదనం ఏం లేదు. ఊరు చివర ఒక పాడుబడిన ఇల్లు. ఆ ఇంటిలో వాడుకపోయిన ఒక గది. అందులో ఆత్మలు ఉన్నాయి అని సినిమా ముందుకెళ్తుంది. ఇంటిలో ఉన్న అందరికీ ఆత్మలు ఆవహిస్తే.. వాల్లు ప్రవర్తించే తీరు, భయం కలిగించే విధంగా సన్నివేశాలు లేవని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం అవే సీన్లు రిపీట్ అవుతుంది. మొదట్లో కలిగినంత భయం.. సినిమా ముందుకెళ్లే కొలది ఉండదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగడం, మూలన ఉన్న కొన్ని సన్నివేశాలు పదే పదే కనిపిస్తాయి. వీటివల్ల సినిమా ముందుకు వెళ్లినట్లు అనిపించదు. విరామ మలుపు సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆత్మలకు పసిగట్టడానికి అన్నమ్మ ఏం చేస్తుందనేది ద్వితీయార్థంలో కనిపిస్తుంది. కడుపులో ఉన్న పిండానికి, బయట ఆత్మకి ముడిపెట్టడంలో పెద్దగా లాజిక్ ఉండదు. తాంత్రిక పూజలు కూడా అంతగా ఉండవు. ఫ్లాష్ బ్యాక్‌లో కూడా భావోద్వేగాలు పండవు. ఎక్కువగా హింస ఉండటం కూడా సినిమాకి మైనస్ అని చెప్పుకోవచ్చు.
ఎవరెలా చేశారంటే?
మధ్య తరగతి కుటుంబానికి చెందిన జంటగా శ్రీరామ్, ఖుషి వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. హారర్‌గా సాగే సన్నివేశాల్లో శ్రీరామ్ నటన బాగుంటుంది. ఈ మూవీలో అన్నమ్మగా ఈశ్వరీరావు పాత్ర చాలా ముఖ్యం. అత్యధికంగా సన్నివేశాలు ఎక్కువగా శ్రీరామ్, ఖుషి, అన్నమ్మ నేపథ్యంలోనే సాగుతాయి. అవసరాల శ్రీనివాస్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. డైరక్టర్ ఇంకా భయానకంగా సన్నివేశాలు చిత్రీకరించి ఉంటే బాగుంటుంది.
సాంకేతిక అంశాలు
సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. కెమెరా, సంగీతం వాళ్ల పనితీరు బాగుంది. శబ్దాలతోనే సినిమాను కొంత భయపెట్టాడు. భయపెట్టే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. కానీ కథనం, కథలోని కొన్ని భావోద్వేగాలపైన ఇంకా కొంచెం దృష్టి పెట్టాలి.
ప్లస్ పాయింట్స్
+భయపెట్టే కొన్ని సన్నివేశాలు
+నటీనటుల నటన
+సంగీతం
మైనస్ పాయింట్స్
-కథలో కొత్తదనం లేకపోవడం
-భావోద్వేగాలు లేకపోవడం