వచ్చే సంక్రాంతి వార్ మామూలుగా ఉండదని ఇప్పటికే చాలా సినిమాలు చెప్పేశాయి. మహేష్ బాబు సినిమా రేసులో ఉన్నా కూడా.. చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలోకి దూకాడు.
ఎఫ్3 తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్. మధ్యలో ఓరిదేవుడా సినిమాలో గెస్ట్ రోల్లో మాత్రమే కనిపించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హిందీ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ అనే సినిమాలో కనిపించాడు. కానీ ఇప్పుడు సాలిడ్ ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. హిట్ ఫ్రాంచైజ్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న యంగ్ టెలెంటెడ్ డైరెక్టర్.. శైలేష్ కొలను దర్శకత్వంలో సైందవ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే రోజు సలార్ వస్తుండడంతో.. సైందవ్ పోస్ట్ పోన్ అయింది.
ఇప్పటికే 2024 సంక్రాంతికి సీజన్‌ని క్యాష్ చేసుకోవడానికి స్టార్ హీరోలు, యంగ్ హీరోలు, డబ్బింగ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13 సినిమాలతో పాటు.. ‘లాల్ సలామ్’, ‘అయలాన్’ అనే డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. ఇక ఇప్పుడు వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్ జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్లుగా అఫీషియల్ అన్నౌన్స్మెంట్ ఇచ్చారు. దీంతో ఈ సారి సంక్రాంతి వార్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే.. ఈసారి రేసులో ఇద్దరు సీనియర్ హీరోలు మహేష్ బాబుతో పోటీ పడుతుండడం విశేషం.
ఎట్టి పరిస్థితుల్లోను ‘నా సామిరంగ’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు నాగార్జున. ఇప్పుడు వెంకీ కూడా రేసులోకి వచ్చేశాడు. ఈ ఇద్దరు మహేష్ బాబుతో పోటీని తట్టుకుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. పైగా గుంటూరు కారం సినిమాకే థియేటర్లు ఎక్కువగా దొరుకుతాయి. అలాంటప్పుడు ఈ సీనియర్ హీరోలు రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. మరి ఈ ఇద్దరిలో ఎవరైనా తగ్గుతారేమో చూడాలి.