Varun Sandesh: కానిస్టేబుల్ గా వరుణ్ సందేశ్..హిట్ కొట్టేనా?
హ్యాపీ డేస్ మూవీతో హీరోగా మారాడు వరుణ్ సందేశ్(Varun Sandesh). ఆ సినిమా ఇచ్చిన క్రేజ్ తో వరుణ్ కి వరస ఆఫర్లు వెల్లువెత్తాయి. వరసగా కొన్ని హిట్లు కూడా పడ్డాయి. కానీ ఆ తర్వాత వరసగా ప్లాపులు ఎదురయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. కొన్ని సినిమాల్లో సెకండ్ హీరో రోల్స్ కూడా చేశాడు. అవి కూడా కలిసి రాలేదు. దీంతో సినిమాలు అన్నీ వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు.
వరుణ్ సందేశ్(Varun Sandesh) అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆయన బిగ్ బాస్ షోలో మెరిశాడు. బిగ్ బాస్ లో టాప్ 5 లో నిలిచి అందరిచేత మంచి పేరు సంపాదించుకున్నాడు. కాగా, ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఆయన మరో సినిమాకి సైన్ చేశాడు. వరుణ్ సందేశ్ హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి “ది కానిస్టేబుల్” అని పేరు ఖరారు చేశారు. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్ లో నిర్వహించారు. బి.నిఖిత జగదీష్ కెమెరా ఆన్ చేయగా, బి జే రిథిక క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ…. ఈ తరహా చిత్రం తను మునుపెన్నడూ చేయలేదని, ఒక ఎమోషనల్ కానిస్టేబుల్ పాత్రలో ఇందులో నటిస్తున్నానన్నారు. దర్శకుడు చెప్పిన కథ, కథనం తననెంతగానో ఆకట్టుకున్నాయనీ, ఈ చిత్రంలో నటిస్తుండటం తనకెంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ చిత్రమిదని చెప్పగా, జూన్ 5 వ తారీఖు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు, మిగతా నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు నిర్మాత బలగం జగదీష్ తెలిపారు.