»A Farmers Life Story Praised By Mega Daughter Niharika Sagu Is A Film That Conveys A Message
SAAGU Movie: మెగా డాటర్ నిహారిక మెచ్చిన రైతు కథ..సందేశాత్మకంగా ‘సాగు’
డైరెక్టర్ వినయ్ రత్నం 'సాగు' మూవీని అద్భుతంగా తీర్చిదిద్దాడు. రైతు చుట్టూ సాగే ఈ కథ అందరికీ నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన అద్భుత చిత్రం. ఓటమికి భయపడని వాడిపై ఓటమి ఎప్పటికీ గెలవలేదని చాటిచెప్పే సందేశాత్మక చిత్రం 'సాగు'.
రైతు ‘సాగు’ చేస్తేనే కదా.. పిడికెడు బువ్వ మన పొట్టను నింపేది. ఆరుగాలం చెమటోడ్చి పంటను పండించేందుకు రైతు కోటి కష్టాలు పడతాడు. కమ్మేస్తున్న కష్టాల మబ్బుల్లో కూడా గుండెలు బాదుకుంటూ పంటను పండించాలనుకుంటాడు. ‘సాగు’ చేయడానికి ఎన్నో కురుక్షేత్ర యుద్దాలనే చేస్తాడు. కన్నీళ్లను తుడుచుకుంటూ ఎన్నో జీవితాలకు బువ్వనందిస్తాడు. అదే తన విజయం అనుకుని మురిసిపోతాడు. అలాంటి రైతు కథను కళ్లకు కట్టినట్లు చూపించినదే ‘సాగు’. మంగళవారం రామానాయుడు స్టూడియోలో సాగు ప్రీమియర్ షోకు మెగా డాటర్ నిహారిక ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘సాగు’ టీమ్‌కు అభినందనలు తెలిపారు.
దర్శకుడు వినయ్ రత్నం సాగు చిత్రాన్ని అద్భుతంగా మలిచాడు. ఈ సినిమా ద్వారా సరికొత్త టాలెంట్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యిందని స్పష్టంగా తెలుస్తోంది. నిర్మాత యశస్వి వంగ ఈ మూవీని రూపొందించారు. ఒక సాధారణ వ్యక్తి జీవితంలో సాగే వైవిధ్యభరిత అనుభూతిని డైెరెక్టర్ వినయ్ రత్నం ప్రేక్షకులకు అందించారు. సాగు చిత్రం ఓ రైతు గుండెకోతను, రైతు భార్య చేసే త్యాగాన్ని, అంటరానితనం వల్ల జరిగే నష్టాన్ని ఎత్తిచూపుతుంది. ప్రేక్షకులు ‘సాగు’ చిత్రాన్ని చూశాక..ఆ రైతుతో పాటే నడుస్తారు. ఆ రైతు శోకాన్ని చూసి కళ్లు చెమ్మగిల్లుతాయి. మొత్తంగా ఈ మూవీని చూశాక ఓ యుద్ధాన్ని గెలిచిన ఫీలింగ్ కలుగుతుంది.
కథ ఏంటంటే:
కథ విషయానికి వస్తే..సినిమా మొదలవ్వగానే హరి అనే ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కట్టుబట్టలతో తన తల్లి ఫోటోను తీసుకుని ఆ యువతి హరి వెంట నడుస్తుంది. అప్పటి వరకూ హరికి ఎవ్వరూ లేరు. హరి నాన్న.. పేకాట, మద్యం వంటి వ్యసనాలకు అలవాటు పడి కాలం చేస్తాడు. తల్లి కూడా ఉండదు. అయితే తన తల్లి హరికి ఓ అర ఎకరం మాత్రమే ఇచ్చి ఉంటుంది. ఆ అర ఎకరంలోనే హరి పంట వేసి తన భార్యను సంతోషంగా చూసుకోవాలనుకుంటాడు. అయితే హరి పెళ్లి చేసుకున్న అమ్మాయి తండ్రి మాత్రం వారిని మనశ్శాంతిగా ఉండనివ్వడు. ఊర్లో ఆయన మాటే చెల్లుతుంటుంది. చూస్తుండగానే కాలం ఓ ఏడాది పరిగెడుతుంది. హరికి ఓ కూతురు పుడుతుంది. మరోవైపు హరి పంట తడికి మోటారు పెట్టేవాళ్లే ముందుకు రారు.
తన స్నేహితుడు కూడా సాయం చేయలేడు. హరి మామకు భయపడి అప్పు కూడా ఎవ్వరూ ఇవ్వరు. అందరి పంటలు పచ్చగా పండి కోతకు కూడా వచ్చి మూటలో చేరుతుంటే హరి పంట నీటి తడిలేక ఎండిపోతుంటుంది. పక్క ఊర్లో పంటలకు మోటరు పెట్టి నీరు అందించేవాడు రూ.20 వేలు ఇస్తేగానీ సాయం చేయనంటాడు. భార్య మాట ప్రకారం స్నేహితుడి వద్దకు వెల్తే ఫ్రెండ్ మామ కులం పేరుతో అవమానిస్తాడు. అంటరానివాడివని హేళనగా మాట్లాడుతాడు. ఇంటికొచ్చి భార్యకు తన బాధను చెప్పుకుంటే అప్పటికప్పుడు చెవిలో ఉన్నవి తీసిస్తుంది. వాటిని కుదువ పెట్టి మోటారు వాడికి డబ్బులు చెల్లించాక హరి మొహంలో వెయ్యి బల్బుల వెలుగు కనిపిస్తుంది. కానీ ఏం లాభం మోటారు వాడు తాగుబోతు. హరి ఇచ్చిన డబ్బుల్తో జల్సాగా తాగి మరుసటి రోజే చస్తాడు. తన పంట మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న హరి ఇక మోటారు వాడు చావడంతో రోదిస్తాడు. గుండెలు పగిలేలా పంటను పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఆశలు ఆవిరవుతాయి. కన్నీళ్లు, కష్టాలు తప్పా ఏం మిగలవు. ఆ రాత్రి తన భార్యతో బాధను పంచుకుని కన్నుమూస్తాడు. బహుశా హరి బాధను చూసి ఆ ఆకాశమే కరిగిందనుకుంటా..ఆ రాత్రికి ఉరుములు, మెరుపులతో ఆ ఆకాశం వర్షం రూపంలో ఏడుస్తుంది. జోరున వర్షం..కానీ హరి నిద్రలేవడు. భార్య మొహంలో ఆనందం. హరిని నిద్రలేపుతుంది. సంతోషంలో తన భర్తకు చూపించడానికి నిద్రలేపుతుంది. లేవడు. చాలాసేపు తట్టి లేపుతున్నా హరిలో చలనం ఉండదు. చనిపోయాడేమోననుకుని బోరున విలపిస్తుంది. ఆఖరికి కొన్ని క్షణాల తర్వాత హరి నిద్రలేస్తాడు. జోరున కురుస్తున్న వానను చూసి పులకరిస్తాడు. తన భార్యతో కలిసి వాన చుక్కలకు పులకరిస్తాడు. జీవితాన్నే జయిస్తాడు.
ఇది ఓ రైతు కథ మాత్రమే కాదు. ఓ సందేశాత్మక చిత్రం. ”ఓటమికి భయపడని వాడిపై ఓటమి ఎప్పటికీ గెలవలేదు” అనే మెస్సేజ్‌ను ఈ మూవీ అందిస్తుంది. పాతికేళ్ల కుర్రాళ్లు రెస్టారెంట్లలో ఫుడ్ వేస్ట్ చేస్తున్న రోజులివి. అలాంటి రోజుల్లో పాతికేళ్లు కూడా రాని వినయ్ రత్నం ఈ రైతు చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించాడు. ప్రేమ, ధ్వేషం, సాయం, కష్టం, ఆనందం వంటి విషయాలను పాత్రల చుట్టూ అల్లిన తీరు అద్భుతం. హీరో వంశీ ప్రసాద్, హీరోయిన్ హారిక బళ్లా తమ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. రైతు ఘోషను, రైతు గాండ్రింపును, రైతు ప్రేమను, రైతు ఆనందాన్ని చూసిన ‘సాగు’ ప్రేక్షకుల మదిలో అలా మెదులుతూనే ఉంటుంది. హ్యాట్సాఫ్ వినయ్ రత్నం అండ్ ‘సాగు’ టీమ్.