Small Balcony : చిన్న బాల్కనీయా? ఇలా అలంకరించుకోండి
సిటీల్లో కొన్ని ఇళ్లల్లో చిన్న చిన్న బాల్కనీలే ఉంటాయి. కాసేపు రిలాక్స్ అవ్వాలంటే అలా బాల్కనీలో ఆరుబయట చూస్తూ కాఫీని సిప్ చేస్తుంటే భలేగా ఉంటుంది. అలాంటి బాల్కనీని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవాలంటే ఇలా చేసి చూడండి.
మనకు ఇంట్లో ఎంత చోటైనా ఉండనీ… కాసేపు అలా రిలాక్స్ అవ్వాలంటే వెంటనే బాల్కనీలోకి వెళ్లి కూర్చుంటాం. ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగాలన్నా, సాయంత్రం ఏదైనా చిరు తిండ్లు తింటూ సమయం గడపాలన్నా మన అడుగులు బాల్కనీ వైపే పడతాయి. మరి మనకు ఉన్నది చిన్న బాల్కనీ(Small Balcony) అయినా అందంగా అలంకరించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం రండి.
ఈ మధ్య బాల్కనీ ఫ్లోర్లను చాలా మంది గ్రాస్ మ్యాట్లతో అలంకరించుకుంటున్నారు. అయితే ఆ ప్రాంతాన్ని తుడుచుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం దీనితో ఇబ్బందిగా ఉంటుంది. దుమ్మంతా ఆ గ్రాస్‌లో పట్టేసి ఇబ్బందిగా తయారవుతుంది. బదులుగా చెక్క టైల్స్ లాంటి వాటిని ప్రయత్నించండి. రిచ్ లుక్‌తోపాటు శుభ్రం చేయడానికీ తేలికగా ఉంటుంది. లేకపోతే మొక్కలు పెట్టుకునే భాగం వరకు గ్రాస్ మ్యాట్, తక్కిన భాగాన్ని వుడ్ టైల్స్‌తో అలంకరించి చూడండి. బాగుంటుంది. చిన్న బాల్కనీల్లో చోటు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ స్థలం మొత్తాన్ని పెద్ద ఫర్నిచర్లు పెట్టి నింపేయవద్దు. బదులుగా చిన్న కాఫీ టేబుల్. రెండు కుర్చీలు వేసుకోండి. అవసరం లేనప్పుడు మడిచి పక్కన పెట్టేటటువంటి వాటిని ఎంచుకోండి.
బాల్కనీలోకి ఎంత ఎండ వస్తుంది? ఎంత సేపు వస్తుంది? అనే విషయాన్ని బట్టి మొక్కల్ని(plants) ఎంచుకోండి. అందమైన మొక్కల స్టాండ్ వల్ల మీ బాల్కనీ ఎంతో ఎలివేట్ అవుతుంది. కృత్రిమ మొక్కల్ని అలంకరించడం కంటే సహజమైన మొక్కలతోనే అలంకరించుకోండి. బాల్కనీ కాస్త కోజీగా ఉండాలి. మనం కూర్చుంటే బయట వారికి ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే గనుక కర్టెన్లకు బదులుగా తీగ జాతి మొక్కలను ఎంచుకోండి. అవి లతలు అల్లుకుని పూలు పూస్తుంటే అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి మనకూ ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే కింద ఎక్కువ మొక్కలు పెట్టుకుంటే మరింత ఇరుకుగా అయిపోతుంది అనుకున్నప్పుడు వాల్ హ్యాంగర్ పాట్లను, ట్రైలింగ్ బాస్కెట్లను ఎంచుకోండి. వెర్టికల్ గార్డెనింగ్ కోసం చాలా రకాల కుండీలు మార్కెట్లో, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ చోటుకు తగ్గట్టుగా కుండీలను ఎంచుకుని మొక్కలను అలంకరించుకోండి. అలాగే మరీ ఎక్కువగా మొక్కలు పెట్టేసినా చిన్న బాల్కనీలు ఇరుకుగా మారతాయి. కాబట్టి చోటుకు తగ్గట్టు తగినన్ని మాత్రమే పెట్టుకోండి. పార్టీ లుక్ కావాలంటే ఈ మొక్కలకే సీరియల్ లైట్లను వేలాడదీయండి. అంతే. బాల్కనీ అదుర్స్.