Fish Struck : గొంతులో ఇరుక్కున్న చేప… విషమ స్థితిలోకి బాలుడు
చెరువులో స్నానం చేసేందుకు దిగిన ఓ బాలుడి గొంతులో ప్రమాద వశాత్తూ చేప దూరి ఇరుక్కుపోయింది. కాసేపటికి బాలుడి పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఏం చేశారంటే..
Fish Struck In Boy Throat : సరదాగా చెరువులో స్నానం చేద్దామని దిగిన ఓ బాలుడి గొంతులోకి ప్రమాదవశాత్తూ చిన్న చేప దూరిపోయి ఇరుక్కుపోయింది. స్థానికులు దాన్ని బటయకు తీసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బాలుడి పరిస్థితి విషమంగా మారడం మొదలుపెట్టింది. దీంతో హుటాహుటిన అతడిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్గీర్ చాంపా జిల్లాలో అకల్తరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సమీర్ గోడ్ అనే పద్నాలుగేళ్ల బాలుడు సరదాగా చెరువులో స్నానం చేసేందుకు దిగాడు. దీంతో ఓ చేప(
FISH) అతడి నోటి గుండా గొంతులోకి(THROAT) వెళ్లి అక్కడ ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. బాలుడి పరిస్థితి విషమంగా మారడంతో అతడిని బిలాస్‌పూర్‌లోని సిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో వైద్యులు అతడికి చిన్నపాటి ఆపరేషన్ని నిర్వహించారు. చిన్నారి మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి చేపను విజయవంతంగా బయటకు తీశారు. తర్వాత అతడిని పర్యవేక్షణలో ఉంచారు. అతడి గొంతు నుంచి ఎనిమిది సెంటీమీటర్లు ఉన్న చిన్న చేపను తాము బయటకు తీసినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది.