ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్… ట్విట్టర్ ని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(elon musk) దక్కించుకున్నారు. ఇప్పటికే ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం పూర్తైనట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. 44 బిలియన్ డాలర్ల (రూ.3.60 లక్షల కోట్లు)తో ఎలన్ మస్క్ ఈ డీల్ పూర్తి చేశాడు. ట్విట్టర్ తన సొంతం కాగానే, ఎలన్ మస్క్ తనదైన మార్పులకు శ్రీకారం చుట్టాడు.
దీనిలో భాగంగా ట్విట్టర్ సంస్థలో కీలకంగా ఉన్న కొందరు ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తొలగించాడు. సీఈవో పరాగ్ అగర్వాల్(parag agrawal)తోపాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్, లీగల్ పాలసీ హెడ్ విజయ గద్దెతోపాటు మరికొందరిని ఉద్యోగంలోంచి తొలగించాడు. వీరిలో కొందరిపై ఎలన్ మస్క్ గతంలో పలు ఆరోపణలు చేశారు. ఫేక్ అకౌంట్లు, కంపెనీకి సంబంధించిన ఇతర అంశాల్లో తనకు తప్పుడు సమాచారం అందించారని ఎలన్ మస్క్ ఆరోపించాడు.
గత ఏడాది నవంబర్లో ట్విట్టర్ సీఈఓగా పరాగ్ అగర్వాల్ అపాయింట్ అయ్యారు. సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో పరాగ్ నియమితులయ్యారు. 10 సంవత్సరాలుగా ఆయన ట్విటర్లో పని చేస్తోన్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యారు. ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్లడాన్ని ఆయన మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు.