»Microsoft Outage Netizens Celebrate Happy Friday Amid Global It Breakdown
Microsoft outage: మైక్రోసాఫ్ట్ డౌన్ అవడంపై నెటిజన్ల సరదా సెటైర్లు
ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ క్రాష్ అయ్యింది. దీంతో దీని సేవల్లో చాలా దేశాల్లో అంతరాయం ఏర్పడింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు మాత్రం సరదా సరదాగా స్పందిస్తున్నారు.
Microsoft outage : శుక్రవారం మైక్రోసాఫ్ట్(Microsoft) సర్వర్లు బ్రేక్ డౌన్ అయ్యాయి. ఈ సాఫ్ట్ వేర్ క్రాష్ వల్ల ప్రపంచం మొత్తం అవస్థల్లో పడింది. విమాన సర్వీసులు దారుణంగా ప్రభావితం అయ్యాయి. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌పై నెటిజన్లు సరదా సరదా కామెంట్లు చేస్తూ నెట్లో పండగ చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్ క్రాష్ అవడం పుణ్యమా అని చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులకు శుక్రవారం నుంచే వీకెండ్ ప్రారంభం అయ్యిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే బోలెడు మీమ్‌లు సైతం నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
‘హ్యాపీ వీకెండ్, థాంక్యూ మైక్రోసాఫ్ట్, థాంక్యూ బ్లూ స్క్రీన్’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ క్రాష్ అవడానికి కారణం అయిన వ్యక్తికి కార్పొరేట్ ఉద్యోగులంతా థ్యాంక్స్ చెబుతున్నారంటూ మరొకరు రాసుకొచ్చారు. ప్రస్తుతం ప్రతి కంపెనీలోని ఐటీ విభాగం అంటూ బ్లూస్క్రీన్ని షేర్ చేస్తున్నారు. ఈ విషయమై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ 2021లోనే ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశారు. ఎప్పుడో ఒకప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్(Microsoft) సర్వర్లనీ క్రాష్ అయి అందరికీ ఇబ్బందులు కలుగజేస్తాయని రాసుకొచ్చారు. ఆ ట్వీట్‌కి నెటిజన్లు ఇప్పుడు రీ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలపైనా మస్క్ స్పందించారు. మైక్రోసాఫ్ట్.. మేక్రోహార్డ్గా మారిందంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
మైక్రోసాఫ్ట్ క్రాష్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమాన యాన సంస్థలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. ఫ్లైట్ బుకింగ్‌లు, చెక్‌ఇన్‌లు, బోర్డింగ్ పాస్‌లు ఇష్యూ చేయడం లాంటి పనుల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫ్లైట్ స్టేటస్, ట్రాకింగ్ లాంటివీ తెలియడం లేదు. దీంతో విమానయాన సంస్థలు పలు సర్వీసుల్ని రద్దు చేశాయి.