అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంహోబెకేన్ నగర (Hoboken city) మేయర్గా ఉన్న భారత సంతతి సిక్కు వ్యక్తికి గుర్తు తెలియని దుండగులు చంపేస్తామంటూ బెదిరింపు ఇ-మెయిల్ (e-mail) పంపించడం కలకలం సృష్టిస్తోంది. తనను, తన కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరింపు లేఖలు వస్తున్నాయని అమెరికన్ సిక్కు లీడర్ రవీందర్ ఎస్ భల్లా (Ravinder S Bhalla) మీడియాకు తెలిపారు. 2017 నవంబర్లో హోబోకెన్ సిటీకి మేయర్గా ఎన్నికైన తొలి సిక్కు వ్యక్తిగా రవి భల్లా చరిత్ర సృష్టించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, ఇటీవల ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన ఆయన.. ఏడాది క్రితం నుంచి తనకు బెదిరింపులు మొదలైనట్లు తెలిపారు.
పదవికి రాజీనామా చేయాలని లేకుంటే చంపేస్తామని గుర్తుతెలియని దుండగులు (Thugs) హెచ్చరించినట్లు తెలిపారు.ఇప్పటివరకు తనకు మూడు లేఖలు అందాయని వివరించారు. మేయర్ (Mayor) గా ఎన్నికైంది నేను.. అధికార బాధ్యతలు చూసేది, నిర్ణయాలు తీసుకునేది కూడా నేనే. మధ్యలో నా భార్యాపిల్లలు ఏంచేశారు? వారిని చంపుతానని బెదిరించడమేంటి?’ అంటూ భల్లా మీడియాతో వాపోయారు. అమెరికా (America) పౌరుడిగా దేశంలో అందరూ సమానమేనని, అందరినీ ఒకేలా చూడాలని అనుకుంటానని భల్లా చెప్పారు. అలాగే అందరికీ సమాన అవకాశాలు దక్కాలన్నదే తన అభిప్రాయమని వివరించారు.
బెదిరింపు లేఖలు అందుకోవడం దురదృష్టకరమని, తన కుటుంబ భద్రత గురించి సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉందని భల్లా అన్నారు ఈ సందర్భంగా విద్య, ప్రేమ ద్వారా ద్వేషాన్ని అంతం చేయవచ్చని రవి భల్లా తెలిపారు. ఇక 26ఏళ్ల వయసులో హోబోకెన్ సిటీకి వచ్చిన ఆయన.. లా చదివిన తర్వాత నెవార్క్(Newark)లోని ఒక చిన్న న్యాయ సంస్థలో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అనతికాలంలోనే అగ్రరాజ్యంలో ప్రముఖ పౌర హక్కుల న్యాయవాదిగా రవి భల్లా గుర్తింపు తెచ్చుకున్నారు. మేయర్ కావడానికి ముందు హోబోకెన్ సిటీ కౌన్సిల్లో ( Hoboken City Council) ఎనిమిదేళ్లు పని చేశారు.