ఓ భారతీయుడు దుబాయ్‌లో జాక్‌పాట్ కొట్టాడు. యూపీ వాసికి అదృష్టం వరించింది. యూఏఈలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న వ్యక్తికి బంపరాఫర్ తగిలింది. లక్కీ డ్రా ద్వారా ఆ వ్యక్తి రాబోవు 25 సంవత్సరాలపాటు ప్రతి నెలా రూ.5.5 లక్షలపైగా నగదు లభించనుంది. ఫాస్ట్ 5 డ్రాలో ఆ వ్యక్తి జాక్‌పాట్ కొట్టాడు. మెగా ప్రైజ్ విన్నర్‌గా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మొహమ్మద్ ఆదిల్ ఖాన్ నిలిచినట్టు గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.
దుబాయ్‌లోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆదిల్ ఖాన్ ఇంటీరియర్ డిజైన్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మెగా లాటరీ ద్వారా ఆయనకు వచ్చే 25 సంవత్సరాలకు నెలకు 25,000 దినార్లు అంటే భారత కరెన్సీలో రూ.5,59,822లు పొందనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఖాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన కుటుంబంలో తానొక్కడే సంపాదించేవాడని, కరోనా మహమ్మారి సమయంలో తన సోదరుడు మరణించాడని, ఆయన కుటుంబ భారం కూడా తనపైనే పడిందని ఖాన్ తెలిపాడు. తనకు వృద్ధులైన తల్లిదండ్రులు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారని, కష్టకాలంలో అదనపు డబ్బు కలిసి రావడం నిజంగా తన అదృష్టం అని ఆదిల్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు.