Las Vegas: అమెరికా(America)లో గన్ కల్చర్ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ కొంత మంది స్టూడెంట్స్ పెన్ క్యారీచేసినట్లు గన్ క్యారీ చేస్తారు. తాజాగా ఓ విశ్వవిద్యాలయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. లాస్ వేగాస్ (Las Vegas)లో బుధవారం ఈ దారుణమైన ఘటన చోటు చేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం నెవాడా విశ్వవిద్యాలయం (Nevada university)లో మధ్యాహ్నం ఓ దుండగుడు కాల్పులకు పాల్పపడ్డాడు. విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
చనిపోయిన ముగ్గురిలో అనుమానితుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకే నగరంలో మరో చోట కూడా కాల్పులు జరిగాయి. దీంతో విశ్వవిద్యాలయంతో పాటు దగ్గర్లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అధికారులు తాత్కాలికంగా మూసి వేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు ఈ మధ్య తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల మైనేలోని లెవిస్టన్ ఏరియాలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. లాస్ వెగాస్ ఒక పర్యాటక ప్రాంతం, అందులో అక్కడ ఎక్కువగా గాంబ్లింగ్ ఆడడానికి ప్రజలు వస్తుంటారు. ఇలాంటి వరుస సంఘటనలతో ఆ ప్రాంతానికి వచ్చేవారు తగ్గిపోతారని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.