ఫ్రాన్స్(France)లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు (police) కాల్చి చంపిన ఘటనపై అల్లర్లు కొనసాగుతున్నాయి పారిస్ (Paris) శివారు ప్రాంతాల్లో మొదలైన అల్లర్లు దేశమంతా విస్తరించాయి నిరసనకారులు అనేక నగరాల్లో పోలీసులతో ఘర్షణకు దిగారు. పాఠశాలలు, దుకాణాలు, బ్యాంకులకు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో 250 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. ఈక్రమంలో ఫ్రాన్స్ అంతటా 875 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వారిలో ఎక్కువ మంది 14 నుంచి 18 ఏళ్ల మధ్యవారే ఉండటం గమనార్హం.ఈ హింసను అణచివేసేందుకు ఎలైట్ రైడ్, జీఐజీఎన్ విభాగాలతో సహా 40,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించామని ఫ్రాన్స్ హోం శాఖ మంత్రి గెరాల్డ్ డార్మానిన్ తెలిపారు. పారిస్ శివారులోని క్లామర్ట్ పట్టణంలో గురువారం రాత్రి కర్ఫ్యూ (Curfew) విధించారు. ఇక యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసు అధికారిపై విచారణ ప్రారంభమైంది. ఆ పోలీసు అధికారిపై హత్యాభియోగాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) ప్రశాంతంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రశాంతతను పునరుద్ధరించే చర్యల్లో రాత్రి 9:00 గంటల తర్వాత పారిస్ బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేసినట్లు రీజియన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.