Prime Minister Narendra Modi's interesting comments on India-China relations
PM Modi: భారత్-చైనా దేశాలు పైకీ గంభీరంగా కనిపించినా ఇరు దేశాల మధ్య ఉన్న స్పర్థలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలు సన్నగిల్లడం మంచిది కాదన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల విషయంలో నెలకొన్న పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు దేశాల మధ్య అత్యంత కీలకమైన సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాల సంబంధాలు ప్రపంచానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. అలాగే చైనాతో సంబంధం పెట్టుకోవడం భారత్‌కు అవసరం అని పేర్కొన్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను తక్షణమే పరిష్కరించాలని, ద్వైపాక్షిక బంధాల్లో నెలకొన్న అసహజ పరిస్థితులను చక్కబెట్టాలని మోడీ అభిప్రాయపడ్డారు.
సానుకూల చర్చలతో రెండు దేశాలు సరిహద్దులో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన యూఎస్ న్యూస్‌వీక్ అనే మ్యాగజైన్‌కు మోడీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్-చైనా దేశాల సంబంధాల గురించి ప్రస్తావించారు. ఈ దేశాల మధ్య సుస్థిరమైన, శాంతియుత సంబంధాలు కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా… ప్రపంచానికి కీలకమన్నారు. దౌత్య, మిలిటరీ స్థాయిలలో మంచి పురోగతిని సాధించగలమని, అది జరగాలంటే రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి అని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి తెలిసిందే. ఆ ఘర్షణలో ఇరువైపుల ప్రాణనష్టం జరిగింది. భారతీయ సైనికులు 20 మంది మరణించగా.. చైనా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారు.