Pakistan: దాయాది దేశమైన పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కారకోరమ్ హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రావల్పిండి నుంచి గిల్గిత్కు వెళ్తున్న బస్సు డయామర్ జిల్లాలో ఈరోజు ఉదయం ప్రమాదానికి గురైంది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు అదుపు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టి క్షతగాత్రులను చిలాస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.