»Nasa Shocking Report 12 Thousand Earthquakes On The Moon
Moon: నాసా షాకింగ్ రిపోర్ట్..చంద్రునిపై 12 వేల భూకంపాలు..!
భూమిపై భూకంపాలు రావడం సహజమే. తాజాగా మొరాకోలో భూకంపం సంభవించి 2వేల మందికిపైగా మృతిచెందారు. గాయాలపాలైన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. ఈ మధ్య భారత్లోని పలు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ భూకంపాల గురించి నాసా కీలక రిపోర్ట్ అందించింది.
భూమితో పోలిస్తే చంద్రునిపై భారీ సంఖ్యలో భూకంపాలు జరిగినట్లు నాసా చెప్పుకొచ్చింది. జాబిల్లిపై తరచూ భూ ప్రకంపనలు చోటుచేసుకుంటూ ఉంటాయని, భూమి కన్నా 20 రెట్లు ఎక్కువ తీవ్రతతో అక్కడి భూకంపాలు ఉంటాయని అమెరికా అంతరిక్ష పరిశోధకులు వెల్లడించారు. ఇటీవలె చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ కూడా చంద్రునిపై భూకంపాల గురించి చెప్పిందని తెలిపారు.
గతంలో అమెరికా అపోలో 17 అనే ప్రాజెక్టు ద్వారా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపింది. అక్కడ కొన్ని సిస్మోమీటర్లను వారు వదిలి వచ్చారు. చంద్రుడిపై భూకంపాలకు సంబంధించిన సమాచారాన్ని ఆ సిస్మోమీటర్ల ద్వారా సేకరించారు. ఐదేళ్లపాటు అవి పనిచేశాయి. ఆ ఐదేళ్ల కాలంలోనే చంద్రుడిపై సుమారు 12 వేలకు పైగా భూకంపాలు, భూ ప్రకంపనలు చంద్రునిపై నమోదైనట్లుగా నాసా వెల్లడించింది.
సిస్మోమీటర్ల సమాచారం మేరకు..చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు సంభవిస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. వాటిలో ఒకటి లోతైన భూకంపం, రెండోది తేలికైన భూకంపం, మూడోది నిస్సార భూకంపం, నాలుగోది థర్మల్ భూకంపం అని నాసా వెల్లడించింది. చుంద్రునిపై ఉల్కలు ఢీకొట్టడంతో కొన్నిసార్లు భూకంపాలు సంభవించాయని, మరికొన్ని సార్లు ఉష్ణోగ్రతలలో కలిగే మార్పుల వల్ల భూకంపాలు సంభవిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.