United States : అమెరికా.. వీధి గొడవలో భారత సంతతి వ్యాపారవేత్త మృతి
అమెరికాలో జరిగిన వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త మృతి చెందడం పలువురిని కలిచి వేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
America : అమెరికాలో వరుసగా భారతీయ విద్యార్థులు, భారతీయ సంతతికి చెందిన వారు మృతి చెందుతుండటం అందరినీ భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఇటీవల వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం కలవరపరుస్తోంది. తాజాగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త ఒకరు అమెరికాలో మృతి చెందారు. వీధి గొడవలో ఆయన తీవ్రంగా గాయపడటంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు.
వివేక్ చందర్ తనేజా అనే భారత సంతతికి చెందిన వ్యాపారి అమెరికా(America)లోని వర్జీనియాలో నివసిస్తున్నారు. అమెరికా ప్రభుత్వానికి సాంకేతిక సహకారం అందిస్తున్న డైనమో టెక్నాలజీస్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఫిబ్రవరి 2వ తారీఖున ఆయన వాషింగ్టన్లో రెస్టారెంట్‌కు వెళ్లి అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో బటయకు వచ్చారు. వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తితో గొడవ జరిగింది.
ఆ గొడవ కాస్తా ఉద్రిక్తంగా మారింది. దుండగుడు ఆయనపై దాడి చేసి విచక్షణా రహితంగా నేలకేసి బాదాడు. దీంతో ఆయన తలకు తీవ్రంగా గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆయనను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచారు. సీసీ టీవీ పుటేజీల ఆధారంగా నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. పట్టిచ్చిన వారికి రివార్డును ప్రకటించారు.