»In Indias Victory Over West Indies Rain Came And Postponed
IND VS WI: భారత్ దూకుడుకి వరుణుడు బ్రేక్.!
ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్ట్ ఇండిస్పై భారత్ పై చేయి సాధించింది. ఇప్పటికే మొదటి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో కూడా దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా గెలుపునకు అడ్డుకట్ట పడింది.
In India's victory over West Indies, rain came and postponed
IND VS WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్(Port of Spain) వేదికగా వెస్టిండీస్(West Indies), ఇండియా(India) టెస్టు సిరీస్‌లో తలపడ్డ విషయం తెలిసిందే. మొదటి టెస్టును కైవసం చేసుకున్న భారత్ రెండవ టెస్టులో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రాగా నిలిచింది. రెండో టెస్టులో చివరి రోజు ఆట ముగిసే సమయంలో వరుణుడు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకపోవడంతో భారత్ డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతమైంది. నాలుగో రోజు వర్షం అంతరాయంతో దాదాపు ఒక సెషన్ ఆటకు నష్టం వాటిల్లింది. చివరి రోజు కూడా వర్షం వస్తూ పోతూ ఉండటంతో ఎంతకీ ఆటగాళ్లు మైదానంలోకి రాలేకపోయారు. చివరికి అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఆదివారం 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆట చివరికి 76/2తో నిలిచింది. అప్పటికి ఆ జట్టు విజయానికి ఇంకా 289 పరుగులు చేయాలి. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28)తో పాటు అరంగేట్ర బ్యాటర్ కిర్క్ మెకంజీ (0)లను అశ్విన్ (2/33) వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. త్యాగ్ నారాయణ్ (24 నాటౌట్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (20 నాటౌట్) నాలుగో రోజు విండీస్ ఓటమిని అడ్డుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేయగా.. విండీస్ 255 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల గురువారం జరుగనుంది.
వెస్టిండీస్ మ్యాచ్‌లో రిషబ్ పంత్(Rishabh Pant) గుర్తుకొస్తున్నారు. ఆస్ట్రేలియాలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) విజయంలో రిషబ్ పంత్ ఎంత ముఖ్య పాత్ర పోషించాడో తెలిసిందే. టెస్టుల్లో సైతం దూకుడుగా ఆడే రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు అభిమానులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒంటి చేత్తో అతను భారీ షాట్లు ఆడే తీరు భలే ఉంటుంది. గత ఏడాది చివర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆటకు దూరం అయ్యాడు. పంత్‌ను మైదానంలో చూడాలంటే ఇంకా కొన్ని నెలలు పట్టొచ్చు. అయితే అతని స్థానంలో విండీస్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన ఆటతో పంత్‌ను గుర్తు చేశాడు. ఆదివారం వెస్టిండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను పంత్ మార్కు షాట్ ఆడాడు. రోచ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని ఒంటి చేత్తో మిడ్‌వికెట్ వైపు సిక్సర్‌గా మలిచాడు. పంత్‌కు ఇలా ఒంటి చేత్తో సిక్సర్లు బాదడం కొట్టిన పిండి. విశేషం ఏంటంటే.. ఇషాన్ ఈ షాట్ ఆడింది కూడా పంత్ బ్యాట్‌తోనే. బ్యాట్ మీద ‘ఆర్పీ 17’ అని కూడా రాసి ఉంది. ఈ సిరీస్‌కు ముందు జాతీయ క్రికెట్ అకాడమీలో పంత్‌తో కలిసి సాధన చేశాడు ఇషాన్. ఆ సందర్భంగా తనకు బ్యాటింగ్ మెలకువలు చెప్పాడని.. అవి తనకెంతో ఉపయోగపడ్డాయని ఇషాన్ వెల్లడించాడు.
టీమ్ఇండియా ఆదివారం బజ్‌బాల్ ను మించిన దూకుడు చూపించింది. సంప్రదాయ శైలిలో, నెమ్మదిగా ఆడే టెస్టుల్లో దూకుడైన ఆటతీరుతో కొత్త ఒరవడిని సృష్టిస్తూ దానికి బజ్‌బాల్ అనే పేరు పెట్టుకుంది ఇంగ్లాండ్. గత రెండేళ్లలో పలు మ్యాచ్‌ల్లో ఈ పద్ధతిలో ఆడే సంచలన విజయాలు సాధించింది ఇంగ్లిష్ జట్టు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మామూలుగా రెచ్చిపోలేదు. వర్షం ముప్పు పొంచి ఉండటం, మ్యాచ్‌లో విండీస్‌ను రెండోసారి ఆలౌట్ చేయడానికి తక్కువ సమయం ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 24 ఓవర్లలోనే 181 పరుగులు (2 వికెట్లకు) చేసి డిక్లేర్ చేసింది టీమ్ఇండియా. రన్‌రేట్ 7.54 కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్లు ఆడిన జట్లలో అత్యధిక రన్‌రేట్ రికార్డు భారత్‌దే. గత రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. ఆ జట్టు 2017లో పాకిస్థాన్‌పై 32 ఓవర్లలోనే 2 వికెట్లకు 241 పరుగులు చేసింది. రన్‌రేట్ 7.53. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా వంద పరుగులు సాధించిన జట్టు రోహిత్ సేన కావడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 74 బంతుల్లోనే భారత్ ఈ మార్కును అందుకుని రికార్డు నెలకొల్పింది.