»If Elected Will Ban Us Companies Doing Business With China Vivek Ramaswamy
Vivek Ramaswamy: విద్యాశాఖను రద్దు చేస్తా, FBI స్థానంలో కొత్త సంస్థ
తాను అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత విద్యాశాఖను రద్దు చేస్తానని ఆసక్తికర ప్రకటన చేశారు వివేక్ రామస్వామి. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదన్నారు. అలాగే ఎఫ్బీఐని (Federal Bureau of Investigation-FBI) కూడా రద్దు చేసి, ఆ స్థానంలో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీలో (US presidential poll) ఉంటానని ప్రకటించిన ముగ్గురు రిపబ్లికన్ నేతలలో ఇద్దరు భారతీయ మూలాలు కలిగిన వారు ఉన్నారు. ఇందులో మొదటి నుండి అందరికీ పరిచయం ఉన్న నిక్కీ హేలీ (nikki haley) కాగా, రెండోవారు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy). తాను అధ్యక్ష పదవి రేసులో ఉంటానని రెండు వారాల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కూడా ఆయన చేస్తున్న ప్రకటనలు ఆసక్తిని రేపుతున్నాయి. తాను అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత విద్యాశాఖను రద్దు చేస్తానని ఆసక్తికర ప్రకటన చేశారు. అసలు ఆ శాఖ ఎందుకు ఉందో కూడా తెలియదన్నారు. అలాగే ఎఫ్బీఐని (Federal Bureau of Investigation-FBI) కూడా రద్దు చేసి, ఆ స్థానంలో మరో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. మూడు సెక్యులర్ రిలీజియన్స్గా మారిన జాతి, లింగం, వాతావరణం.. ఈ రోజు అమెరికాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నారు. శరీర రంగు ఆధారంగా వ్యక్తుల నేపథ్యాన్ని గుర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాను అధికార పీఠమెక్కితే చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేయడాన్ని నిషేధిస్తానని బోల్డ్ గా ప్రకటన చేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి… ఆయన ప్రతిపాదించిన అమెరికా ఫస్ట్ అనే విధానం నుండి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పారు. ఆయన కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (Conservative Political Action Conference)లో మాట్లాడారు.
‘ఏ విషయంలో అయినా నిజాయితీ చాలా ముఖ్యం. మనం చైనా నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకోవాలనుకుంటే సీసీపీ (Chinese Communist Party-CCP) పడిపోయే వరకు లేదా ఇది తనంతట తాను సంస్కరించుకునేంత వరకు చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేయకుండా నిషేధించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇంతకు మించి మనకు మరో మార్గం లేదు’ అని వివేక్ పేర్కొన్నారు. ‘అలాగే నేను గతంలోనే చెప్పాను. మొట్ట మొదట యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (US Department of Education) మూసివేయాలి. ఇది ఉండాలని చెప్పడానికి ఎలాంటి కారణమూ లేదు. ఇలాంటిది ఎప్పటికీ ఉండకూడదు. అలాగే రెండో గవర్నమెంట్ సంస్థను కూడా మూసివేస్తానని ప్రకటిస్తున్నాను. అదే FBI. 60 ఏళ్ల క్రితమే ఇది చేయాల్సి ఉండింది. ఇది రిపబ్లికన్లను, డెమోక్రట్లను ఒకేవిధంగా బాధించింది. దీని స్థానంలో కొత్త దానిని సృష్టించాల్సిన అవసరం ఉంది. స్వయంప్రతిపత్తి గల దేశంగా మారడానికి తాము జే ఎడ్గార్ హూవర్ మార్గంలో నడుస్తాం.’ అన్నారు. ఆయన పద్దెనిమిది నిమిషాల పాటు ప్రసంగించారు.
వివేకా రామస్వామి పారిశ్రామికవేత్త. వోక్.ఇంక్ పుస్తక రచయిత. 37 ఏళ్ల వివేక్ ఓహియోలో జన్మించారు. హార్వార్డ్, యేల్ యూనివర్సిటీలలో చదువుకున్నారు. బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడిగా భారీగా కూడబెట్టారు. అనంతరం అసెట్ మేనేజ్ మెంట్ సంస్థను స్థాపించారు. కార్పోరేట్ ప్రపంచంలో జాత్యాహంకారం, వాతావరణ మార్పులపై సూడో ఉదారవాద భావనలు విసుగు తెప్పిస్తున్నాయని అంటున్నారు. ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని చెబుతున్నారు. అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలనేది ఆయన వాదన.