»Good News For Tourists Of Seven Countries Including India Free Visa For That Country
SriLanka Free Visa : భారత్ సహా ఏడు దేశాల పర్యాటకులకు గుడ్న్యూస్.. ఆ దేశానికి ఉచిత వీసా!
శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో సహా ఏడు దేశాల పర్యాటకులకు ఫ్రీ వీసా పాలసీని ప్రారంభించింది. దీంతో శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను చూసేందుకు ఆ ఏడు దేశాలకు చెందిన పర్యాటకులకు ఉచిత వీసా లభించనుంది.
పర్యాటకులకు శ్రీలంక శుభవార్త చెప్పింది. భారత్ సహా ఏడు దేశాల పౌరులకు గుడ్న్యూస్ చెప్పింది. వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను చుట్టేయొచ్చు. శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆ ఏడు దేశాలకు అనుమతి ఇచ్చింది. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్లాండ్ దేశాల పర్యాటకులు ఇకపై ఉచిత వీసాతో శ్రీలంకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ మేరకు శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది.
శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈ విషయాన్ని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకూ ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. శ్రీలంకకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. దేశ జీడీపీలో 10 శాతం పర్యాటక రంగానిదే కావడంతో ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనాకు ముందు శ్రీలంక పర్యాటక ఆదాయం 360 కోట్ల డాలర్లు ఉండగా , ప్రస్తుతం 60 కోట్ల డాలర్ల దిగువకు చేరింది. ప్రస్తుతం సంక్షోభంతో శ్రీలంక కుదేలైంది. అందుకే పర్యాటక రంగం ద్వారా ఆర్థిక బలాన్ని పొందేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల్లో 30 శాతం మంది రష్యా, ఉక్రెయిన్, పోలాండ్, బెలారస్ దేశాలకు చెందిన వారు కావడం విశేషం. 2023 ఆఖరిలోపు 20 లక్షల మందిని ఆకర్షించాలనే లక్ష్యంతో శ్రీలంక ఫ్రీ వీసా పాలసీని ప్రవేశపెట్టింది.