టర్కీలో భూకంపం విధ్వంసం సృష్టించింది. టర్కీతో పాటు దాని పక్కనే ఉన్న సిరియా దేశాన్ని కూడా వదల్లేదు. రెండు దేశాలు భూకంపం ధాటికి దద్దరిల్లిపోయాయి. వందలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. రిక్టర్ స్కేల్‌పై 7.8 గా తీవ్రత నమోదు అయింది. భూకంపం తీవ్రత పెరగడం వల్ల 1400 మంది బిల్డింగ్స్ కూలిపోయి మృతి చెందారు. సోమవారం ఉదయం ఒకసారి భూకంపం వచ్చింది. మళ్లీ మధ్యాహ్నం 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. పలు మార్లు భూమి కంపిస్తుండటం వల్ల టర్కీలో చాలా నష్టం ఏర్పడుతోంది. ఇప్పటికే పలువురు మరణించగా ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది.
ఒక పెద్ద బిల్డింగ్ అయితే పేక మేడలా కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో ఎవరైనా ఉన్నారా లేరా? అనేది స్పష్టత లేకున్నప్పటికీ కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఆ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇప్పటి వరకు మూడు సార్లు టర్కీని భూకంపం వణికించింది. శిథిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు. సహాయక బృందాలు శిథిలాల చిక్కుకున్న వారిని రక్షిస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మళ్లీ భూకంపం ఎక్కడ వస్తుందో అని బిల్డింగ్స్‌లో ఉన్న జనాలంతా రోడ్లమీదికి పరుగులు తీశారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు, శిబిరాలకు అధికారులు తరలిస్తున్నారు.