»Alert For Those Who Play With Pets 60 Insects In Womens Eyes
Shocking: పెంపుడు జంతువులతో ఆడుకునేవారికి అలెర్ట్..మహిళ కళ్లలో 60 కీటకాలు!
ఓ మహిళ కళ్లలో 60 కీటకాలను వైద్యులు గుర్తించారు. ఆ మహిళ పెంపుడు జంతువులతో ఆడుకోవడం వల్ల వాటి లార్వా నుంచి ఆ కీటకాలు ఆమె కళ్లలోకి చేరినట్లు వైద్యులు నిర్దారించారు. ఆపరేషన్ చేసి ఆమె కంటి నుంచి 60 కీటకాలను బయటకు తీశారు.
చాలా మంది ఎంతో ఇష్టంగా కొన్ని జంతువులను పెంచుకుంటూ ఉంటారు. కుక్క, పిల్లి వంటివాటిని పెంచుకుంటూ వాటిని కూడా తమ ఇంట్లో భాగస్వాములుగా చూస్తారు. వాటితో రోజూ ఆడుకుంటూ సరదాగా గడుపుతారు. అయితే వాటివల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయనే విషయం చాలా మందికి తెలియదు. తాజాగా పెంపుడు జంతువులతో ఆడుకునే ఓ మహిళ కళ్లలో 60 కీటకాలు సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ దిగ్భ్రాంతికర సంఘటన చైనాలో చోటుచేసుకుంది.
చైనాలోని కున్మింగ్లో ఓ మహిళ కళ్లను పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు. కళ్లలో దురద వస్తోందని ఆ మహిళ వైద్యుల వద్దకు వెళ్లింది. వైద్యులు ఆమె కనురెప్పలు, కనుగుడ్ల మధ్యన కీటకాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ కీటకాలు పాకుతూ ఉండటం వల్ల వారు వెంటనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఆ మహిళకు ఆపరేషన్ చేసి కళ్లలో బతికి ఉన్న 60 కీటకాలను బయటకు తీశారు.
డాక్టర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆ మహిళ షాక్ అయ్యింది. సాధారణంగా ఈగ ద్వారా ఆ కీటకాలు వ్యాపిస్తాయని, అయితే ఆ మహిళకు తను పెంచుకుంటున్న పిల్లులు, కుక్కల ద్వారా వ్యాపించినట్లు వైద్యులు తెలిపారు. పెంపుడు జంతువులతో ఆడుకునేటప్పుడు వాటి శరీరంపై ఉన్న లార్వా నుంచి కీటకాలు కంటిలోకి చేరినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జంతువులతో ఆడుకున్న తర్వాత చేతులతో కళ్లను రుద్దుకోవడం వల్ల అవి కళ్లల్లోకి చేరాయని, దాని వల్ల ఆమె శరీరంలో కూడా ఇన్ఫెక్షన్ అనేది వ్యాపించిందని వైద్యులు నిర్ధారించారు.