ఉగాండా(Uganda)లో దారుణం జరిగింది. ఓ స్కూల్(School)పై దుండుగులు దాడి చేశారు. ఈ ఘటనలో 25మంది ప్రాణాలు కోల్పోయారు. 8మంది తీవ్రంగా గాయపడ్డారు.అలైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ADF)కు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు.. పశ్చిమ ఉగాండాలో మారణహోమం సృష్టించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. దాడి చేసి.. కిడ్నాప్ చేసి..!డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)కు సరిహద్దుల్లో ఉన్న మ్పోండ్వేలోని లుబిరిరా పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు దాడి చేశారు.ఈ విషయాన్ని స్థానిక పోలీసులు తెలిపారు.”పాఠశాలకు చెందిన డార్మిటరిని కాల్చేశారు.
ఫుడ్ స్టోర్(Food store)ని దోచుకున్నారు. ఇప్పటివరకు 25మంది మృతదేహాలను వెలికితీశాము. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించాము. 8మంది పరిస్థితి విషమంగా ఉంది,” అని ఉగాండా పోలీస్‌శాఖ ప్రతినిధి ఫ్రెడ్ ఎనాంగే (Fred Enange) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలుగా కృషిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.తూర్పు ఉగాండాలో 1990వ దశకంలో ఈ ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. 1986 నుంచి అక్కడ అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవెరీ ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం చేతిలో ఓటమి తర్వాత.. డీఆర్సీలోని నార్త్ కివు (North Kivu) రాష్ట్రంలో రీలొకేట్ అయ్యింది. అక్కడి నుంచి గత రెండు దశాబ్దాలుగా ఈ ఏడీఎఫ్ సభ్యులు కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీరికి ఇస్లామిక్ స్టేట్(Islamic State) గ్రూప్ తోనూ సంబంధాలు ఉన్నాయి. 2021లో ఉగాండా రాజధాని కంపాలా(Kampala)లో జరిగిన భీకర బాంబు దాడి ఈ ఏడీఎఫ్ పనేనని ఆరోపణలు ఉన్నాయి.