»A 70 Year Old Woman Who Gave Birth To Twins Mother And Child Are Fine
70 Years OLd Woman: కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు..తల్లీ బిడ్డలు క్షేమం!
ఓ 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆఫ్రికాలోనే ఇలా అతి పెద్ద వయసులో పిల్లలకు జన్మనిచ్చిన ఏకైక మహిళగా ఆమె రికార్డుకెక్కింది. తల్లి అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకున్నందుకు పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మహిళలకు 45 ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టడం కాస్త కష్టమవుతుందని అందరూ చెబుతుంటారు. అయితే కొందరిలో మాత్రం అలా జరగదు. 60 ఏళ్లు దాటిన మహిళలు కూడా బిడ్డల్ని కన్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ 70 ఏళ్ల మహిళ కవలలకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉగాండాలో చోటుచేసుకుంది. తల్లికావాలనే తన కలను 70 ఏళ్ల వయసులో ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ నెరవేర్చుకుంది.
సాధారణ పద్ధతిలో అది కూడా 70 ఏళ్ల వయసులో గర్భం దాల్చటం అనేది అంత సాధ్యం కాదు. ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె గర్భం దాల్చి కవలలకు జన్మనిచ్చింది. ఉగాండా దేశంలోని కంపాలాలో నఫీనా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వయస్సులో బిడ్డల్ని కనడంతో ఇదొక అద్భుతమని ప్రసవం చేసిన డాక్టర్ ఎడ్వర్ట్ అనడం విశేషం.
సఫీనాకు సిజేరియన్ సర్జరీ ద్వారా ప్రసవం చేశామని, ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 70 ఏళ్ల వయసులో పిల్లల్ని కనడంతో ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా ఆమె రికార్డుకెక్కారు. సఫీనాకు 1992లో మొదటి భర్త చనిపోగాఆ తర్వాత నాలుగేళ్లకు రెండో పెళ్లి జరిగింది. వారికి 20 ఏళ్లు దాటినా బిడ్డలు పుట్టకపోవడంతో 2020లో ఐవీఎఫ్ ద్వారా ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప చనిపోయింది. కానీ తల్లి కావాలనే తన కోరిక మాత్రం చావలేదు. ఎట్టకేలకు 70 ఏళ్ల వయసులో ఆమె మరోసారి ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది.