»4 Indians Duped Into Joining Wagner Mercenaries Forced To Fight Russia Ukraine War Report
Russian Army : ఏజెంట్ మోసం – ఉక్రెయిన్‌తో యుద్ధానికి భారతీయులు!
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ ఏజెంట్ చెప్పడంతో నలుగురు భారతీయులు దారుణంగా మోసపోయారు. వారిని అక్కడికి తీసుకువెళ్లి బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి తమను పంపిస్తున్నారంటూ వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Indians In Russian Army : నలుగురు భారతీయుల్ని ఓ ఏజెంట్ దారుణంగా మోసగించాడు. రష్యాలోని మాస్కోలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి అక్కడికి తీసుకువెళ్లి రష్యా సైన్యంలో చేర్పించాడు. వారు రష్యా తరఫున ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు బలవంతంగా తమని పంపిస్తున్నారని బాధితులు భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ వారిని కాపాడి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని కలబురగికి జిల్లాకు చెందిన సయ్యద్ ఇలియాస్ హుస్సేన్, మహ్మద్ సమీర్ అహ్మద్, సోఫియా మహ్మద్ అనే ముగ్గురితోపాటు ఉత్తర ప్రదేశ్‌లోని కాస్గంజ్కు చెందిన అర్బాబ్ హుస్సేన్ అనే నలుగురు యువకులు గతేడాది నవంబర్ 11వ తేదీన ఓ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా మాస్కోలో ఉద్యోగం చేసేందుకు వెళ్లారు. ఈ విషయమై అర్బాబ్ హుస్సేన్ తండ్రి కొన్ని వివరాల్ని వెల్లడించారు.
ముంబయికి చెందిన ఓ ఏజెంట్ రష్యా(Russia)లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వీసాలు సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. సెక్యూరిటీ హెల్పర్లుగా ఉంటే నెలకు రెండు లక్షల రూపాయల జీతం అని చెప్పారు. దీంతో అర్బాబ్ కుటుంబం రూ.3.80 లక్షలు రుణం తీసుకుని ఏజెంట్‌కి చెల్లించింది. ఇంటి నుంచి వెళ్లాక అర్బాజ్ ఐదు రోజులకు రష్యా చేరుకున్నట్లు ఫోన్ చేశాడు. తమను బలవంతంగా రష్యా ఆర్మీలో చేర్పించారని 15 రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు తెలిపాడు.
తమను యుద్ధం చేయడానికి ఉక్రెయిన్(Ukraine) సరిహద్దులకు బలవంతంగా తీసుకెళుతున్నారని, తాము మోసపోయామని వీడియోని పంపించాడు. ఈ ఆధారాల ఆధారంగా బాధితుల కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు విదేశాంగ శాఖా మంత్రికి లేఖ రాశారు. ‘తెలంగాణ, కర్ణాటక, ఉత్తర భారతదేశంలోనూ ఇలా చాలా మందిని రష్యా సైన్యంలో చేర్చినట్లు సమాచారం. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని వారిని వెంటనే రక్షించాలి’ అని విదేశాంగ శాఖ మంత్రికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.