MLA Lasya : వరుస ప్రమాదాల్లో ఎమ్మెల్యే లాస్య.. చివరికి కబళించిన మృత్యువు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు వరుసగా ప్రమాదాలు జరిగాయని చివరికి ఈ ప్రమాదంలో ప్రాణాల్ని కోల్పోవల్సి వచ్చిందని సన్నిహితులు చెబుతున్నారు.
BRS MLA Lasya Nanditha Died in a Car Accident : గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ఎంపికైన లాస్య రోడ్డు ప్రమాదంలో కన్ను మూశారు. అయితే ఈ ప్రమాదానికి ముందు కూడా ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వరుస ప్రమాదాల నుంచి ఆమె బయట పడ్డారని సన్నిహితులు చెబుతున్నారు. చివరికి ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాదం ఆమె ప్రాణాల్ని బలిగొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్య మొదటి సారి ఓ ప్రైవేటు ఆసుపత్రి లిఫ్టులో ఇరుక్కుపోయారు. లిఫ్టులో ఓవర్ లోడ్ కారణంగా అది సడన్గా కిందికి వెళ్లిపోయింది. దీంతో కొద్దీ సేపు ఆసుపత్రి వద్ద గందరగోళం నెలకొంది. కాసేపటి తర్వాత సిబ్బంది లిఫ్టు డోర్లను బద్దలుగొట్టి అందులో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు. ఎమ్మెల్యే కూడా సురక్షితంగా బయట పడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మళ్లీ ఈ ఫిబ్రవరి నెల 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో లాస్య పాల్గొన్నారు. సభ పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్కు ప్రయాణం అయ్యారు. చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోం గార్డులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ హోం గార్డు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎమ్మెల్యే లాస్య తలకు కూడా గాయాలయ్యాయి. అప్పుడు ప్రాణాలతో బయట పడిన ఆమె మళ్లీ రెండు వారాలు కాకుండానే ఈ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.