ఆఫ్ఘనిస్తాన్ లో చలిగాలుల తీవ్రత ఎక్కువవుతోంది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 157 మంది చలిగాలులకు తట్టుకోలేక మరణించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సమితి తీవ్ర విచారం వ్యక్తి చేసింది. ఆఫ్ఘన్ లో వాతావరణం మరీ చల్లబడిపోయిందని, మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
గత 15 ఏళ్లలో ఇంత వరకూ ఇలాంటి చలిగాలులు లేవని, మంచు తుఫాను కారణంగా ఇక్కడి పరిస్థితులు చాలా క్లిష్టంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ తాలిబన్లు అధికారంలో ఉండటం వల్ల మహిళపై తీవ్ర ఆంక్షలు పెట్టారు. ఎన్జీవోల్లో మహిళలు పనిచేయకూడదని షరతు విధించారు. దీంతో ఎన్జీవోల్లో మహిళలు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అందాల్సిన సాయం అందడం లేదని పలు నివేదికలు తెలుపుతున్నాయి.