ఇండోనేషియా(Indonesia)లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని సముద్రంలో ఓ నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 19 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. (Missing In Ferry Sinking) ఆగ్నేయ సులవేసి ప్రావిన్స్ రాజధాని కేందారీకి దక్షిణంగా 200 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. మునా ద్వీపంలోని ఒక బే గుండా అనే నౌక ప్రమాదానికి గురైంది.
నౌక ప్రమాదం జరిగినపుడు అందులో 40మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. రాత్రి సమయంలో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని అధికారులు వెల్లడించారు. ప్రాణాలతో బయటపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి ముహమ్మద్ అరాఫా వెల్లడించారు.
నౌక ప్రమాద ప్రాంతం నుంచి లభ్యం అయిన మృతదేహాలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఇండోనేషియాలో 17,000 కంటే ఎక్కువ ద్వీపాలున్నాయి. చాలా వరకూ అందరూ నౌకల్లోనే ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, నౌకల ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాలకు తిలోదకాలు ఇవ్వడంతో ప్రయాణికుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.