»Walking 11 Minutes A Day Lowers Early Death And Health Risks Study Shows
Cambridge Study: రోజుకు 11 నిమిషాలు నడిస్తే, అకాల మరణాలు తగ్గుతాయి
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
ఇటీవల గుండె జబ్బు (Heart Attack) వంటి వివిధ కారణాల వల్ల చిన్న వయస్సులోనే మృతి చెందిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. మాట్లాడుతూనే ఒకరు… తింటూనే మరొకరు… డ్యాన్స్ చేస్తూ ఇంకొకరు… అలాగే ఒరిగిపోయారు. ఇవి యువతను, తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. లగ్జరీ జీవితం (luxury lifestyle) కోసం మారిన సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం (Technology) మనిషి ఆయువును తగ్గించడానికి ప్రధాన కారణం. గతంలో అరవైలలో గుండె సమస్యలు (Heart Problems) వచ్చేవి… ఇప్పుడు నలభై ఏళ్ల లోపే కనిపిస్తున్నాయి. రక్తపోటు (blood pressure), మధుమేహం (diabetes) వంటి కారణాలు లేకున్నా గుండెపోటు బారిన పడుతున్నారు. ఇందుకు మారిన జీవన శైలి (Life Style), ఆహారపు అలవాట్లు (Food Habits), శారీరక శ్రమ లోపించడం, వ్యాయామం లేకపోవడం (exercise) వంటివి కారణంగా చెప్పవచ్చు. దూమపానం, కొలెస్ట్రాల్, ఆహారపు అలవాట్లు, అధిక బరువు లేదా ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిడి, డ్రగ్స్ వినియోగం, రక్తనాలాలు చితికి పోవడం వంటి వివిధ కారణాలు గుండెను దెబ్బతీస్తాయి.
నాలుగింట మూడొంతుల యువతకు ఛాతి నొప్పి రాకుండానే గుండెపోటు (Heart Attack) వస్తోంది. కొందరిలో ఛాతి మధ్య భాగంలో మంటగా, బిగుతుగా, బరువుగా ఉంటుంది. ఈ సమస్య ఎడమ చేతికి లేదా గొంతుకు పాకుతుంది. చెమట పట్టడం, వాంతులు కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్షణం డాక్టర్ వద్దకు వెళ్లాలి. లేదంటే రక్త సరఫరా తగ్గిపోయి ఆకస్మిక మరణం సంభవించవచ్చు. బాధితులను మూడు నాలుగు గంటల్లో హాస్పిటల్ కు తీసుకు వెళ్తే బతికే అవకాశాలు ఉంటాయి. తరుచూ ఛాతి నొప్పి వస్తే పరీక్షలు చేయించుకోవాలి. దూమపానం, ఊబకాయం వంటి వారి మరింత జాగ్రత్తగా ఉండాలి. ECG ద్వారా గుండె సమస్యను గుర్తించవచ్చు. కొంతమందికి మొదటిసారి బయటపడకపోవచ్చు. రెండుమూడుసార్లు తీసి, చూడవచ్చు. ఎకో, ప్రోటోనిన్ పరీక్షలు చేయించుకోవాలి.
గుండెపోటు రావద్దనుకుంటే.. దూమపానం, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తీపి, ఉప్పు, నెయ్యిని సాధ్యమైనంత తగ్గించాలి. బీఫ్, పోర్క్, మటన్ తినడం తగ్గించాలి. వనస్పతి నూనెతో చేసిన ఫుడ్ ను తగ్గించాలి. ప్రాసెస్డ్, ప్యాకేజ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు వాకింగ్, వ్యాయామం చేయాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. యోగా, ధ్యానం చేయాలి.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో (cambridge university Study) తేలింది. ఈ నడక ద్వారా గుండెజబ్బు, పక్షపాతంతో పాటు పలు క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చునని వెల్లడైంది. ఇందులో సగం చేసినా పది అకాల మరణాల్లో ఒకదానిని తగ్గించవచ్చునని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో పరిశోధకులు తెలిపారు. పెద్దవారు వారంలో 150 నిమిషాలు మోస్తారు నుండి తీవ్రస్థాయి లేదా 75 నిమిషాలు తీవ్ర శారీరక శ్రమ చేయాలని చెబుతోంది. ఏమీ చేయకపోవడం కంటే ఎంతోకొంత శారీరక శ్రమ వల్ల లాభమే అని తెలిపింది. వారానికి 75 నిమిషాల నడక వల్ల లేదా శారీరక శ్రమ వల్ల గుండె వ్యాధుల ముప్పును 17 శాతం, క్యాన్సర్ ముప్పును 7 శాతం తగ్గించవచ్చునని తేల్చింది.