Sanitizer Side Effects : ఇదువరకటి కాలంలో వైద్యులు, నర్సుల్లాంటి వారు మాత్రమే ఎక్కువగా శానిటైజర్లను వాడుతూ ఉండే వారు. అయితే కరోనా పాండమిక్ తర్వాత ప్రతి ఇంట్లోనూ శానిటైజర్ ఉంటోంది. అప్పుడు అంతా ఎక్కువగా దీన్ని వాడేవారు. అయితే ఆ తర్వాత కూడా చాలా మంది అదే అలవాటును కొనసాగిస్తున్నారు. బయట ఏదైనా ముట్టుకున్న ప్రతి సారీ శానిటైజేషన్ చేసుకుంటున్నారు. ఇలా అనవసరంగా ఎక్కువగా దీన్ని ఉపయోగించడం వల్ల కూడా మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అవేంటంటే…
శానిటైజర్లు(Sanitizer) తరచుగా వాడటంపై… ఒహయ్యోలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ, మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ ఓ అధ్యయనం చేసింది. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు బయటకు వచ్చాయి. మన మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా, చురుగ్గా పనిచేసేందుకు ఇవి సహాయపడతాయి. మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపుతాయి. అయితే, ప్రస్తుతం మనం వాడే శానిటైజర్లలో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.
మనం శానిటైజర్‌ని(Sanitizer) తరచుగా రాసుకుంటూ ఉండటం వల్ల అందులో ఉండే రసాయనాలు చర్మం, ముక్కు, నోరు ద్వారా లోపలికి వెళతాయి. అవి నరాల చుట్టూ ఉండే ఈ కణాలను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా పని చేయడం మానేస్తుంది. శానిటైజర్లే కాదండోయ్… ఇంటిని శుభ్రం చేసే లిక్విడ్లు, బాత్రూమ్లు కడిగేందుకు వాడేవి, సబ్బులు తదితరాల వల్ల కూడా ఈ దుష్ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఆర్గానిక్‌గా ఉండే వాటిని ఇంట్లో వాడుకోవడం మేలు.