Sleep mask for eyes benefits : ఇటీవల కాలంలో చాలా మందికి నిద్ర లేమి అనేది పెద్ద సమస్యగా తయారైంది. రాత్రి అయ్యాక మంచం మీద వాలి గంటలు గంటలు వేచి చూసినా నిద్రలోకి జారుకోరు. దీంతో ఆ ప్రభావం వీరి ఆరోగ్యాల మీద తీవ్రంగా పడుతుంది. అలాగే మరి కొంత మందికి ఏ మాత్రం వెలుతురు కనిపించినా నిద్ర రాదు. కళ్లు ఆ వెలుతురును గుర్తిస్తాయి. ఫలితంగా నిద్ర హార్మోన్లు విడుదల కావు. దీంతో నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు స్లీప్ మాస్కులు ధరించడం వల్ల చక్కగా నిద్ర పడుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
స్లీప్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం కళ్లకు(eyes) మాస్క్ ధరించి పడుకోవడం వల్ల మంచే జరుగుతుందట. కళ్లు బయట అంతా చీకటిగా ఉన్నట్లు నిద్రకు సమయం అయినట్లు భావిస్తాయి. దీంతో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. అందువల్ల తేలికగా నిద్రలోకి జారుకుంటారు. ఇలా మాస్కులు ధరించడం వల్ల కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వాటికి విశ్రాంతి లభిస్తుంది. మంచిగా నిద్ర పట్టేందుకు ఆస్కారం ఉంటుంది.
ఈ స్లీప్ మాస్కుల్ని(Sleep mask) కళ్లకు ధరించడం వల్ల నిద్ర పట్టడమే కాదు.. కళ్లు తేమగా ఉండేందుకూ ఇవి సహకరిస్తాయి. అంటే ముఖ్యంగా ఏసీ గదుల్లో ఉండే వారికి తరచుగా కళ్లు పొడిబారిపోయే సమస్యలు వస్తాయి. వీటిని ఇది తగ్గిస్తుంది. అయితే మానసిక సమస్యలు, మందుల వల్ల గనుకు నిద్రకు దూరం అయితే స్లీప్ మాస్కులు పని చేయవని అధ్యయనం పేర్కొంది. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలని తెలిపింది.