Dry Cough : ఈ రోజుల్లో శ్వాస సంబంధమైన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, ముసలి వారికి ఇవి ఎక్కువ అవుతుంటాయి. పొడి దగ్గుతో రోజుల తరబడి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి పని చేసే ఇంటి వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇలా దగ్గు వచ్చే వారు ఇంట్లో తేలికగా అందుబాటులో ఉండే పసుపును ప్రయత్నించవచ్చు. దీనిలో కుర్క్యుమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియకల్ లక్షణాలు ఉంటాయి. ఓ టీ స్పూను పసుపుకు ఎనిమిదో వంతు నల్ల మిరియాల పొడి చేర్చి పండ్ల రసంలో కలుపుకుని తాగాలి. లేకపోతే వీటితో కషాయంలా చేసుకుని తాగడం వల్లా పొడి దగ్గు(Dry Cough) తగ్గుతుంది.
స్వచ్ఛమైన తేనెలో పుష్కలంగా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దగ్గుతో బాధపడే వారు రోజులో నాలుగైదు సార్లు స్పూనుడు చొప్పున తేనెను తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. లేదంటే టీ, గోరువెచ్చని నీటికి తేనెను కలిపి తాగడం వల్లా ఉపశమనం లభిస్తుంది. అలాగే మన అందరి ఇళ్లల్లో తేలికగా అందుబాటులో ఉండే పదార్థం అల్లం. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నొప్పులను తగ్గిస్తుంది. అల్లం టీ చేసుకుని తాగడం వల్ల పొడి దగ్గుకు(Dry Cough) మందులా పని చేస్తుంది. మీ ఇంట్లో అల్లం మొక్క ఉన్నట్లయితే దాని మొదలు భాగాన్ని లాగి శుభ్రంగా కడిగి నమలడం వల్లా ఉపశమనం లభిస్తుంది. అల్లాన్ని నేరుగా తినడం ఇష్టం లేని వారి కోసం అల్లం రసంతో చేసిన క్యాప్య్సూల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
మన దేశంలో మసాలా ఛాయ్‌కి చాలా ప్రాచుర్యం ఉంది. ఇది తాగడం వల్ల పొడి దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయలాంటి సుగంధ ద్రవ్యాలను వేసి మరిగించి చేసే టీ మంచి సువాసనతో ఉండటమే కాకుండా గొంతు సంబంధిత సమస్యలనూ తగ్గిస్తుంది. దీన్ని చేసేప్పుడు చక్కెరకు బదులుగా కొంచెం తేనె కలుపుకోవడం మంచిది.