చిన్న పిల్లలు, పెద్దవారు అనే తేడా లేకుండా బాధను అంతా కన్నీటి రూపంలోనే వ్యక్త పరుస్తారు. అలా ఏడవడమూ మన ఆరోగ్యానికి మంచిదేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు!
Benefits of Crying : చిన్న పిల్లలు ప్రతి చిన్న బాధనూ ఏడుపుతోనే వ్యక్త పరుస్తారు. అయితే వయసు పెరిగే కొద్దీ అంతా బాధను లోపల పెట్టేసుకుంటారు. చాలా ఇబ్బందిగా అనిపిస్తే తప్ప ఆ బాధ కన్నీరై బయటకు రాదు. అయితే నిజానికి ఇలా బాధ ఉన్నప్పుడు ఏడ్చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా చేయకుండా లోపల దాన్ని అలాగే ఉంచేసుకోవడం వల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు పెరుగుతాయంటున్నారు.
కంటి నుంచి వచ్చే నీళ్లన్నీ కన్నీళ్లే కాని వాటిలోనూ చాలా తేడాలుంటాయి. ఉదాహరణకు మనం ఉల్లిపాయల్లాంటివి కట్ చేస్తున్నప్పుడు వచ్చే నీటిని రిఫ్లెక్స్ టియర్స్ అంటారు. దెబ్బ తగిలినా, దుమ్ము పడినా కళ్ల మంటను తగ్గించేందుకు ఇవి వస్తాయి. అలాగే మన కళ్లను శుభ్ర పరచడానికి వచ్చే నీటిని బాసల్ టియర్స్ అంటారు. మనలోని బాధను వ్యక్తం చేయడానికి వచ్చే వాటిని మాత్రం ఎమోషనల్ టియర్స్ అంటారు.
మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని అణిచేసుకోకుండా ఏడ్చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. యూఎస్ఏలోని యేలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంపై జరిపిన పరిశోధనల్లో కొన్ని విషయాలు వెల్లడయ్యాయి. ఏడ్చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మనకు మనకే సూథింగ్ అనిపిస్తుంది. మనసు కుదుట పడినట్లు ఉంటుంది. ఎక్కువ ఏడ్చేసిన తర్వాత ఒక్కసారిగా ప్రశాంతం అయిపోవడం చాలా మందికి అనుభవమే. ఇలా ఏడ్చేయడం వల్ల రక్తపోటు నియంత్రితమవుతుంది. మెదడు వేడి తగ్గుతుంది. శరీరంలో ఉండే నొప్పుల నుంచీ శ్వాంతన లభిస్తుంది. ఈ సమయంలో ఆక్సిటోసిన్, ఎండోజెనస్ ఒపియడ్స్ అనేవి మనలో విడుదల అవుతాయి. ఈ ఎండార్ఫిన్లు మనలో ఉన్న నొప్పులను తగ్గిస్తాయి.