»Santhan Freed Life Convict In Rajiv Gandhi Assassination Case Dies In Hospital
Santhan : రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ‘రాజీవ్ గాంధీ ఆసుపత్రి’లో మృతి
రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా యావజ్జీవ కారాగార శిక్షను అనుభవించి బయటకు వచ్చిన శ్రీలంక వ్యక్తి సంథాన్ రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.
Rajiv Gandhi Case Convict Died : రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించి బయటకు వచ్చిన సంథాన్ అలియాస్ సుథేందిర రాజ (55) బుధవారం చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. కాలేయ వైఫల్యంతో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో బుధవారం ఉదయం 7:50 గంటలకు తుది శ్వాస విడిచాడు. తన సొంత దేశం శ్రీలంకకు వెళ్లకుండానే అతడు భారత్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
సంథాన్ 1991లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) హత్య కోసులో దోషిగా నిలిచాడు. ఇతడితో పాటు మొత్తం ఏడుగురు శ్రీలంక దేశీయులకు ఈ కేసులో శిక్ష పడింది. తొలుత ఇతడికి ఉరి శిక్ష విధించారు. తర్వాత దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. 32 ఏళ్లు శిక్ష అనుభవించిన తర్వాత ఇతడిని విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో 2022 డిసెంబరులో ఇతడు జైలు నుంచి విడుదల అయ్యాడు.
అప్పటి నుంచి సొంత దేశం వెళ్లడానికి సంథాన్ దగ్గర పాస్పోర్టుగాని, వీసాగాని లేదు. దీంతో తాను సొంత దేశానికి వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని మద్రాస్ హై కోర్టును ఆశ్రయించాడు. అక్కడ తన పెద్దమ్మతో కలిసి ఉంటానని విజ్ఞప్తి చేశాడు. అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతడి న్యాయవాది తెలిపారు. దీంతో అనారోగ్యంతో సంథాన్ చివరికి చెన్నైలోని రాజీవ్ గాంధీ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచాడు. మృత దేహాన్ని శ్రీలంకకు పంపించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.