మంచు మనోజ్ సినిమాలకు దూరమై ఐదారేళ్లు అవుతోంది. ఇక మా హీరో సినిమాలు చేయడా? ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడు? అసలు సినిమాలు చేస్తాడా.. లేదా? అనే డైలామాలో ఉన్నారు మంచు అభిమానులు. అయితే రెండు మూడు రోజులుగా సస్పెన్స్ మెయింటెన్ చేసిన మనోజ్.. ఎట్టకేలకు సాలిడ్ అప్డేట్ ఇచ్చేశాడు. తన జీవితంలోని తదుపరి దశలోకి ప్రవేశించడానికి సంతోషిస్తున్నాను అని ప్రకటించాడు. చెప్పినట్టే జనవరి 20న ఆ సస్పెన్స్ కి తెర దించాడు. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నా అంటూ అనౌన్స్ చేశాడు. మనోజ్ తొలి ప్రకటన చూసిన చాలామంది అది తన పెళ్లి గురించి అనుకున్నారు. కానీ మొత్తానికి తన సినిమా అప్డేట్ ఇచ్చి అభిమానులను ఖుషి చేశాడు.
మనోజ్ స్టైల్లోనే ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రాబోతోంది. WhatTheFish అనే టైటిల్‌తో సినిమా ప్రకటించాడు. దీనికి ‘మనం మనం.. బరంపురం’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే రిలీజ్ చేసిన పోస్టర్ కూడా యాక్షన్ మోడ్‌లో అదిరిపోయేలా ఉంది. బ్యాక్ పోజ్‌లో మనోజ్ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. మీ ప్రేమను తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది అంటూ పోస్టులో రాశాడు. ఈ సినిమాతో వరుణ్ అనే దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. వాట్ ది ఫిష్ అనేది డార్క్ కామెడీ మరియు హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 75 రోజుల పాటు టొరంటో, కెనడాతో పాటు వివిధ ప్రదేశాలలో జరగనుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను 6ఐఎక్స్ సినిమాస్, ఎ ఫిల్మ్ బై వీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.