గీతానంద్, నేహా సోలంకి నటీనటులుగా యాక్ట్ చేస్తున్న గేమ్ ఆన్(Game On) మూవీ టీజర్(teaser) విడుదలైంది. టీజర్లో హీరో యాక్షన్ సీన్స్, రొమాన్స్ సహా పలు సీన్లు ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీ ప్రియులకు ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
గీతానంద్, నేహా సోలంకి (90 ఎంఎల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘గేమ్ ఆన్(game on) చిత్రం టీజర్(teaser) విడుదలైంది. నాని హీరోగా నటించిన దసరా మూవీ విడుదలైన థియేటర్లలో ఈ చిత్రం టీజర్ వీడియోని రిలీజ్ చేశారు. టీజర్ సైకలాజికల్ థ్రిల్లర్ లాగా ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ఓవైపు ఫైట్స్, రొమాన్స్ సీన్లతోపాటు కొన్ని ఉత్కంఠ రేపే సన్నీవేశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతోపాటు గీతానంద్ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘గేమ్ ఆన్’ టైటిల్, ఫస్ట్ లుక్ సహా రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు తమ్ముడి దర్శకత్వంలో అన్న హీరోగా నటించడం విశేషం. మధుబాల, ఆదిత్య మీనన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నవాబ్ గ్యాంగ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ చిత్రం టైటిల్ సాంగ్ కి నవాబ్ గ్యాంగ్ పనిచేశారు. అంత బిజీలోను తమ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని నిర్మాత రవి కస్తూరి తెలిపారు. మరోవైపు ఇప్పటికే విడుదల చేసిన రెండో పాటకు కూడా మంచి స్పందన వస్తుందని తెలిపారు. అరవింద్ విశ్వనాథన్ విజువల్స్ అద్భుతంగా ఇచ్చాడని, ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుందని రవి అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే టైలర్, విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ కథ ఉంటుందని దర్శకుడు దయానంద్ పేర్కొన్నారు. తెలుగులో ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు రావడమే కాదు సక్సెస్ కూడా అవుతూ ఓ మార్క్ క్రియేట్ చేస్తున్నాయని తెలిపారు. ఆ కోవలోనే గేమ్ ఆన్ సినిమా కూడా ఉంటుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్…అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన చెప్పారు.